రైల్లో కరోనా వ్యాప్తి ఎంతో చెప్పేసిన తాజా అధ్యయనం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 10:16 AM GMT
రైల్లో కరోనా వ్యాప్తి ఎంతో చెప్పేసిన తాజా అధ్యయనం

కరోనాతో సహజీవనం తప్ప మరే మార్గం లేదన్న విషయాన్ని అర్థం చేసుకొని.. జీర్ణించుకోవటానికి చాలా సమయమే పట్టింది. ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ అన్నది లేదన్న విషయంపై స్పష్టత వచ్చేసింది. తక్కువలో తక్కువ వచ్చే ఏడాది మార్చి .. ఏప్రిల్ కు కానీ వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వచ్చినా వెంటనే అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం తక్కువ.

ఈ నేపథ్యంలో కరోనా కమ్మేసే అవకాశాల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. లాక్ డౌన్ తో ఎవరికి వారు.. ఎక్కడికక్కడ ఉంటున్నా.. రోజులు గడిచే కొద్దీ ఏదో సమయంలో ప్రయాణించక తప్పని పరిస్థితి. ఇలాంటప్పుడు గతంలో మాదిరి కాకుండా.. జాగ్రత్తలతో ప్రయాణించాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. ఇంతకాలం జాగ్రత్తగా ఉన్నది ప్రయాణంలో జరిగే పొరపాటుతో మాయదారి రోగం బారిన పడే ప్రమాదం ఉంది. కరోనావేళలో రైళ్లలో ప్రయాణించే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైళ్లలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందా? లాంటి సందేహాలు కలుగక మానవు.

దీనికి సంబంధించి బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌథాంప్టన్ శాస్త్రవేత్తలు చైనాలోని హైస్పీడ్ రైళ్లలో రీసెర్చ్ చేశారు. దీని ద్వారా రైళ్లల్లో ప్రయాణించే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పేర్కొన్నారు.చాలాదేశాల్లో మాదిరే మన దేశంలోనూ రైళ్లను పరిమితంగానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైలు ప్రయాణాలు చేయాలసి వస్తే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ పరిశోధనలో గుర్తించారు. అవేమంటే..

కరోనా సోకిన వ్యక్తికి సమీపంలో నిలువుగా ఐదు వరుస సీట్లలో.. అడ్డుగా మూడు వరుస సీట్లలో కూర్చునే వారికి వైరస్ సోకే ముప్పు సున్నా నుంచి పది శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. రోగి పక్క సీట్లో కూర్చునే వ్యక్తికి వైరస్ అంటే అవకాశం 3.5 శాతం ఉంటుందని.. పక్కనే కాకున్నా.. అదే వరుసలో కూర్చునే వారికి ప్రమాదం ఒకటిన్నర శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.

కరోనా రోగితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు గంట ప్రయాణం సాగినా ఫర్లేదు. కాకుంటే భౌతికదూరం మీటరు వరకు సరిపోతుందని.. అదే ప్రయాణ సమయం రెండు గంటల పాటు అయితే.. దూరం 2.5 మీటర్ల కంటే ఎక్కువగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో కరోనా రోగికూర్చున్న సీటులో తర్వాత కూర్చొని ప్రయాణించే వారికి వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని తేల్చారు. అలాంటి అవకాశం కేవలం 0.075 మాత్రమేనని చెబుతున్నారు. రైలు ప్రమాదం చేయొచ్చు. కాకుంటే.. పక్కా జాగ్రత్తలు తీసుకుంటే.. ముప్పుతక్కువన్నది తాజా రీసెర్చ్ స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Next Story
Share it