రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్‌రత్న.. మరో నలుగురికి కూడా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2020 2:54 PM GMTభారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు అర్హత సాధించిన వారి జాబితాను కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, టెబుల్ టెన్నిస్ ఛాంపియన్ మణికా బాత్రా, 2016 పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్‌లు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు.
అర్హత సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి అవార్డులను అందజేయనున్నారు. అలాగే.. అర్జున అవార్డుకు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను భాస్కర్‌తో పాటు మరో 27 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ధ్యాన్ చంద్ అవార్డుకు, ద్రోణాచార్య అవార్డుకు అర్హత సాధించిన వారి పేర్లను కూడా కేంద్రం ప్రకటించింది. క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోనీ 2007లో, విరాట్ కోహ్లీ 2018లో అందుకున్నారు.
ఇదిలావుంటే.. రోహిత్ 224 వన్డేలాడి 9,115 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు, 43 అర్ధసెంచరీలు ఉన్నాయి. 32 టెస్టులాడి 2,141 పరుగులు చేశాడు. అందులో ఆరు శతకాలు, 10 అర్థ శతకాలు కూడా ఉన్నాయి. ఇక 107 టీ20లు ఆడిన రోహిత్.. నాలుగు సెంచరీలు, 20 అర్థసెంచరీల సాయంతో 2,713 పరుగులు చేశాడు.