225 నగరాల్లో సేవలను నిలిపివేసిన జోమాటో
Zomato has ceased operations in 225 smaller cities. ఫుడ్ డెలివరీ టెక్ కంపెనీ జొమాటో దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేసింది.
By Medi Samrat Published on 12 Feb 2023 8:37 PM IST
ఫుడ్ డెలివరీ టెక్ కంపెనీ జొమాటో దేశంలోని 225 చిన్న నగరాల్లో తన సేవలను నిలిపివేసింది. నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీ ఇలా చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్ల నష్టాన్ని చవిచూసింది. శుక్రవారం నాడు కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
225 నగరాల్లో సేవలను నిలిపివేయడంపై కంపెనీ మాట్లాడుతూ.. గత కొన్ని త్రైమాసికాల్లో చిన్న నగరాలలో పనితీరు బాగా లేదని పేర్కొంది. అదే సమయంలో.. కంపెనీ తన లాభాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా మాట్లాడింది. ఆర్డర్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి గోల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో 9 లక్షల మంది చేరారని జొమాటో పేర్కొంది.
భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్‌లలో జోమాటో ఒకటి. కంపెనీ ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం దేశంలోని 1,000 కంటే ఎక్కువ నగరాల్లో నడుస్తోంది. ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టం 5 రెట్లు పెరిగి రూ. 343 కోట్లకు చేరుకుంది. అయితే, ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.1,112 కోట్ల నుంచి 75% వృద్ధితో రూ.1,948 కోట్లకు చేరుకుంది.
జొమాటో కంపెనీ 2008లో హర్యానాలోని గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. అప్పుడు దాని పేరు Zomato కాదు.. Foodiebay. దీనిని దీపిందర్ గోయెల్, పంకజ్ చద్దా స్థాపించారు. అప్పుడు జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీస్ కాదు.. రెస్టారెంట్ డిస్కవరీ సర్వీస్.. అంటే నగరంలోని వివిధ రెస్టారెంట్‌ల గురించి సమాచారాన్ని అందించడం దీని పని.