టాటా అలా.. మహీంద్రా ఇలా..!
Tata Motors to Raise Passenger Vehicle Prices. ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ బుధవారం (జనవరి 19) నుంచి తన
By Medi Samrat
ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ బుధవారం (జనవరి 19) నుంచి తన ప్యాసింజర్ వాహనాల ధరలను స్వల్పంగా పెంచనుంది. వేరియంట్, మోడల్ ఆధారంగా సగటున 0.9 శాతం పెరుగుదల ఉంటుందని కంపెనీ తెలిపింది. "అదే సమయంలో, కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు ప్రతిస్పందనగా కంపెనీ నిర్దిష్ట వేరియంట్‌లపై రూ. 10,000 వరకు తగ్గింపును కూడా ఇవ్వనుంది. పెరిగిన వ్యయాలలో గణనీయమైన భాగాన్ని కంపెనీ భరిస్తోందని, మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడం వల్ల ఈ కనిష్ట ధరల పెంపు ద్వారా కొంత వరకూ ఖర్చులను భర్తీ చేయాలని ఈ నిర్ణయాన్ని తీసుకుంది". అయితే జనవరి 18 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న టాటా కార్లపై 'ప్రైస్ ప్రొటెక్షన్' అందించాలని కంపెనీ నిర్ణయించింది.
మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) తమ బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని ప్రకటించింది. తమ బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ప్రత్యర్థి వాహనాల కంటే మైలేజీ తక్కువ ఇస్తే, వినియోగదారులు ఆ వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చని తెలిపింది. బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ తాజా ప్రకటనలో తెలిపింది. మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంపుదల చేసేందుకు తాజా స్కీమ్ ప్రకటనే నిదర్శనమని.. రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో మహీంద్రా నిబద్ధత విశ్వసనీయమైనదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.