ఫస్ట్ టైమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే

మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్‌లు తప్పనిసరి కాదని పేర్కొంటూ, రుణ దరఖాస్తులలో CIBIL పాత్రను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

By Knakam Karthik
Published on : 25 Aug 2025 10:51 AM IST

Business News, CIBIL Score, Credit Score, Loan Application, RBI, Finance Ministry

ఫస్ట్ టైమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే

మొదటిసారి రుణం తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్‌లు తప్పనిసరి కాదని పేర్కొంటూ, రుణ దరఖాస్తులలో CIBIL పాత్రను ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకులు మీ CIBIL స్కోర్‌ను ఏకైక నిర్ణయాధికారిగా ఉంచకుండా, వివిధ అంశాల ఆధారంగా వ్యక్తిగత దరఖాస్తులను ఆమోదించవచ్చు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.

లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కొత్తగా రుణం తీసుకునేవారికి క్రెడిట్ హిస్టరీ ఉండదనే విషయాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవాలని పంకజ్ చౌదరి సూచించారు. "మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి క్రెడిట్ హిస్టరీ లేదనే ఏకైక కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించవద్దని బ్యాంకులకు, ఇతర రుణ సంస్థలకు ఆర్‌బీఐ స్పష్టమైన సూచనలు జారీ చేసింది" అని ఆయన వివరించారు. రుణ మంజూరుకు ఆర్‌బీఐ ఎలాంటి కనీస క్రెడిట్ స్కోర్‌ను నిర్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాలు, వాణిజ్యపరమైన అంశాలను బట్టి రుణాలపై నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. రుణ దరఖాస్తుదారుని అర్హతను అంచనా వేయడంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (సీఐఆర్) అనేది అనేక అంశాలలో ఒకటి మాత్రమేనని, అదే తుది నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.

అయితే, సిబిల్ స్కోర్ లేనంత మాత్రాన రుణాలను విచక్షణారహితంగా ఇవ్వరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు తప్పనిసరిగా దరఖాస్తుదారుడి ఆర్థిక సామర్థ్యంపై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని ఆదేశించింది. గతంలో ఏవైనా రుణాలుంటే వాటిని తిరిగి చెల్లించిన తీరు, సెటిల్‌మెంట్లు లేదా రైట్-ఆఫ్‌లు వంటి వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇక, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి గరిష్ఠంగా రూ. 100 మాత్రమే వసూలు చేయాలని మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా 2016లో ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ప్రతి క్రెడిట్ బ్యూరో ఏటా ఒకసారి ప్రతి వ్యక్తికి ఉచితంగా ఎలక్ట్రానిక్ రూపంలో క్రెడిట్ రిపోర్ట్‌ను అందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Next Story