గృహ రుణాలు తీసుకున్న వారిపై ఎస్బీఐ ఊహించని భారం మోపింది. వడ్డీ రేట్లను ఏకంగా అర శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.5 శాతం చేసినట్టు ఎస్బీఐ తెలిపింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.65 శాతం కాగా.. దీనికి అదనంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం ఉంటుందని తెలిపింది. నూతన రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ప్రస్తుతం ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 6.65 శాతంగా, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా ఉన్నాయి. వీటికి క్రెడిట్ రిస్క్ రూపంలో కొంత శాతాన్ని కలిపి రుణాలపై రేట్లను ఎస్బీఐ అమలు చేస్తోంది. ఆర్బీఐ కీలక రేట్లను సవరించినప్పుడల్లా రుణాలపై రేట్లను బ్యాంకులు సైతం సవరిస్తుంటాయి. ఇటీవలే రెపో రేటును 0.40 శాతం మేర ఆర్బీఐ సవరించగా.. దీనికంటే మరో 0.10 శాతం అదనంగా ఎస్బీఐ రుణ రేట్లను పెంచేసింది.