రెపోరేటును పెంచిన ఆర్‌బీఐ.. గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు..!
RBI Raises Key Policy Rate By 35 Basis Points.రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపోరేటును
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2022 12:06 PM ISTరిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపోరేటును మరో 35 బేసిక్ పాయింట్ల మేర పెంచింది. గత మూడు రోజులుగా జరిగిన ద్రవ్య పరపతి కమిటీ(ఎంపీసీ) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం వెల్లడించారు. రెపో రేటు((బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ)ను 35 బేసిక్ పాయిట్ల మేర పెంచినట్లు తెలిపారు. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది.
ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ లోనూ బలపడినట్టు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన స్థాయిలో ఉందన్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు సైతం 0.35 శాతం పెరిగి 6.5 శాతానికి చేరాయి. ఇప్పటికీ ఆర్ బీఐ సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకునే క్రమంలోనే ఉన్నట్టు తెలిపింది. వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే ఉంటుందని ఆర్ బీఐ అంచనా వేసింది.
మరింత భారం కానున్న ఈఎంఐలు
రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి. ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.