అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం మధ్య సమతుల్యతను కొనసాగించడం వల్ల ఆర్‌బిఐ వరుసగా పదవ సమావేశంలో కీలకమైన రెపో రేటును 6.5 శాతం వద్ద బుధవారం ఉంచింది. అయితే, సెంట్రల్ బ్యాంక్ తన వైఖరిని 'తటస్థంగా' మార్చుకుంది, ఇది రాబోయే విధానాలలో కోతకు దారితీయవచ్చు.
తాజాగా వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంభిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.
గత నెలలో US ఫెడరల్ రిజర్వ్ బెంచ్ మార్క్ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ RBI యథాతథ స్థితిని కొనసాగించింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఫిబ్రవరి 2023 నుండి బెంచ్‌మార్క్ వడ్డీ రేటుపై RBI యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. భారత జిడిపి వృద్ధి బలంగానే ఉన్నా ఆహార ద్రవ్యోల్బణం పెరగకుండా ఆర్‌బిఐ అప్రమత్తంగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.