రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఫలితంగా రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపోరేటు 3.35శాతంగానే కొనసాగనుంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. రెపో రేటు సైతం 4శాతం గాను ఉంచినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం 2022 -2023లో ఆర్ధిక వృద్ధిరేటు 7.2శాతంగా ఉంటుందని అంచనా వేశారు. తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 16.2 శాతం, రెండవ త్రైమాసికంలో 6.2 శాతంగా ఉండనుంది. సెకండ్ అడ్వాన్స్‌డ్ అంచనాల ప్రకారం..ఫైనాన్షియల్ ఇయర్ 2022లో జీడీపీ వృద్ధి 8.9 శాతంగా నిర్ణయించబడిందని శక్తికాంద్ దాస్ అన్నారు. ఇక కరోనా ప్రారంభమైన సమయంలో ద్రవ్యలభ్యతను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన సర్దుబాటు వైఖరిని ఆర్‌బీఐ ఇంకా కొనసాగిస్తుండడం గమనార్హం. దేశీయంగా ఇంధన, కమెడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతున్నప్పటికీ ఆర్‌బీఐ మాత్రం వడ్డీరేట్లో ఎలాంటి మార్పు చేయలేదు.