ద్రవ్యోల్బణ కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రెపోరేటును పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేటుపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు చెప్పారు. దీంతో రెపో రేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి చేరింది.
పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు రెపోరేటు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆర్‌బీఐ రెపో రేటు 5.6 శాతానికి చేరుకుంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరగనుంది.