రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2024 ఆర్థిక సంవత్సరానికి.. కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 140% పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023కి మంజూరు చేసిన మొత్తం రూ.87,416 కోట్లు. తాజాగా కేటాయించిన డివిడెండ్‌తో ద్రవ్యలోటు 0.4 శాతం వరకు తగ్గొచ్చనేది విశ్లేషకులు అంచనా. ఈ స్థాయిలో కేంద్రానికి డివిడెండ్ కేటాయించడం ఆర్‌బీఐ చరిత్రలో ఇదే తొలిసారి. మరోవైపు కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరుతో కేంద్రం కోసం నిర్వహించే ప్రత్యేక నిధి పరిమితిని ఆర్‌బీఐ 6.5 శాతానికి పెంచింది.
ముంబైలో జరిగిన సెంట్రల్ బోర్డ్ యొక్క 608వ సమావేశంలో, ఔట్‌లుక్‌కు సంభావ్య ప్రమాదాలతో సహా ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులపై బోర్డు చర్చించింది. 2,10,874 కోట్ల మిగులును బదిలీ చేయాలని బోర్డు చివరకు నిర్ణయించింది.
కంటింజెన్సీ రిస్క్ బఫర్ అంటే?
అత్యవసర నిధుల తరహాలో కేంద్రం కోసం కంటింజెన్సీ రిస్క్ బఫర్ పేరుతో ఆర్‌బీఐ ప్రత్యేక నిధిని కేటాయిస్తుంది. ప్రభుత్వ బాండ్ల విలువలు తగ్గడం, మానిటరీ పాలసీలో మార్పులతో ఈ సవాళ్లు ఎదురైన సందర్భాల్లో ఈ నిధులను ఆర్‌బీఐ వినియోగిస్తుంది. ఏటా కొంత పర్సెంట్ చొప్పున నిధులు కేటాయించి మిగిలిన మొత్తాన్ని ఆర్థిక ఏడాది ముగిశాక కేంద్రానికి ఇస్తుంది. ఆర్‌బీఐకి వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ఈ కంటింజెన్సీ రిస్క్ బఫర్‌కి కేటాయిస్తుంది.