రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూతన తయారీ కేంద్రం ప్రారంభం
Radiant Appliances and Electronics launches new manufacturing Unit. రేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ సోమవారం తమ తయారీ యూనిట్ ను హైదరాబాద్ ప్రారంభించింది
By Medi Samrat Published on 2 May 2022 10:45 AM GMTరేడియంట్ అప్లయెన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ సోమవారం తమ తయారీ యూనిట్ ను హైదరాబాద్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ది, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర ఐటీ ,వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు హాజరయ్యారు. నూతన ప్లాంట్ ద్వారా రేడియంట్ అప్లయెన్సస్ తమ ఉత్పత్తి సామర్ధ్యంను సంవత్సరానికి 2.1 మిలియన్ యూనిట్ల నుంచి 4.5 మిలియన్ యూనిట్లకు విస్తరించనుంది.
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూతన ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఐటీ, నగరాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ప్లాంట్‌ను 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటుచేశారు. దీనిద్వారా అదనంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ''తెలంగాణాలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరంగా అత్యున్నత సంస్ధలలో ఒకటిగా రేడియంట్ కొనసాగుతుండటంతో పాటుగా.. ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా నిలుస్తుంది. స్వల్పకాలంలోనే 5 మిలియన్ ఎల్‌ఈడీ టీవీల ఉత్పత్తిని సాధించిన రేడియంట్ టీమ్‌ను అభినందిస్తున్నాను. ఈ నూతన విస్తరణతో, రేడియంట్ మరిన్ని నూతన మైలురాళ్లను అందుకోగలదని, మరింతగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తూనే తెలంగాణాలో తయారీ వాతావరణం సృష్టించగలదని ఆశిస్తున్నాను'' అని అన్నారు.
తెలంగాణాలో తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించనున్నట్లు ఆయన వెల్లడిస్తూ ''పరిశ్రమకు పూర్తి అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఎలక్ట్రానిక్స్ మొదలు ఎలక్ట్రిక్ వాహనాల వరకూ అన్ని ఉత్పత్తి విభాగాలలోనూ తయారీ పరిశ్రమలను రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాము. అత్యుత్తమ మౌలిక వసతులతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలో నైపుణ్యవంతులైన యువత కూడా అధికంగా ఉంది'' అని అన్నారు.
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలకా్ట్రనిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమీందర్ సింగ్ సోయిన్ మాట్లాడుతూ ''తయారీకి సంబంధించిన నూతన ప్లాంట్ ప్రారంభంతో మా సామర్థ్యం విస్తరించాము. సమీప భవిష్యత్‌లో ఎల్‌ఈడీ టీవీ తయారీ పరంగా మేము నెంబర్ 1గా నిలువ నున్నాము. రేడియంట్ అప్లయెన్సస్ స్థిరంగా స్వదేశీకరణ చేసేందుకు కృషి చేయడంతో పాటుగా స్థానిక వెండర్లతో సన్నిహితంగా పనిచేస్తూ అనుబంధ సంస్ధలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రోత్సహించడానికి తగిన వాతావరణం సృష్టిస్తుంది. సమీప భవిష్యత్‌లో భారీ గృహోపకరణాల విభాగంలో నూతన తయారీ యూనిట్లను జోడించడం ద్వారా గణనీయంగా స్ధానిక ఉపాధి అవకాశాలను అందించనున్నాం''అని అన్నారు.