ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సరసన చేరిపోయారు. 10000 కోట్ల (వంద బిలియన్) డాలర్ల క్లబ్ లోకి ఎంటరయ్యారు. శుక్రవారం ఆయన సంస్థ రిలయన్స్ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో ఆయన సంపద కూడా పెరిగింది. దీంతో ఆయన 11 మంది ఉన్న వంద బిలియన్ డాలర్ల అత్యున్నత వర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ముఖేశ్ ఆస్తులు 100.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.56 లక్షల కోట్లు) . ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన సంపద 2,380 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.79 లక్షల కోట్లు) పెరిగింది.
బిలియనీర్ల ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లో మొత్తం 11 మంది ఉన్నారు. సంపన్నుల జాబితాలో మస్క్, బేజోస్ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్, ల్యారీ పేజ్, మార్క్ జుకర్‌బర్గ్, సెర్గే బ్రిన్, లారీ ఎలిసన్, స్టీవ్ బాల్మర్, వారెన్ బఫెట్, ముఖేశ్ అంబానీలు ఉన్నారు. ముఖేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొన్నది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం ఈ ఏడాది 23.8 బిలియన్ల డాలర్లను ముఖేశ్ ఆర్జించారు.