ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకువచ్చి జీఎస్టీ విధించే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇకపై ఫుడ్ డెలివరీ యాప్‌లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ-కామర్స్ ఆపరేటర్లైన ఫుడ్ డెలివరీ సర్వీసులు జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్ సర్వీస్ స్టార్టప్‌లకు జీఎస్టీ భారం పడనుంది. శుక్రవారం(సెప్టెంబర్ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో ఫుడ్ డెలివరీ యాప్‌లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ పరిధిలోకి తీసుకొచ్చి ట్యాక్స్ వసూలు చేస్తారు.
సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్ చేసుకోవడానికి సదరు యాప్‌లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ బావిస్తోంది. ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్ ప్రకారం ఫుడ్ డెలివరీ యాప్‌లను ట్యాక్స్ కలెక్టర్స్ ఎట్ సోర్స్‌గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం భావిస్తోంది. రెస్టారెంట్ కార్యకలాపాలను అన్‌రిజిస్ట్రర్ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.