ఢిల్లీలో బుగ్గన.. ఏంటి కథ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 6:08 AM GMT
ఢిల్లీలో బుగ్గన.. ఏంటి కథ?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, అదనపు నిధులపై సీతారామన్ తో బుగ్గన చర్చించారు. ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు తదితర విషయాలపై సీతారామన్ తో చర్చించినట్లు బుగ్గన వెల్లడించారు.

కరోనా విపత్తు వల్ల లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, పన్ను వసూళ్లు తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. జీఎస్టీ బకాయిలతో పాటు అదనంగా ఏపీకి మరికొన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని నిర్మలా సీతారామన్ ను కోరినట్లు బుగ్గన వెల్లడించారు.

కరోనా వల్ల పోలవరం నిధుల విడుదలలో జాప్యం ఏర్పడిందని, నిధుల విడుదలలో జాప్యం లేకుండా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. కరోనా ప్యాకేజి కింద ఏపీకి రావాల్సిన నిధులు తప్పకుండా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు బుగ్గన వెల్లడించారు.

అయితే, ఓ వైపు లోటు బడ్జెట్ ...కరోనా విపత్తు వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందంటూ బుగ్గన చెబుతున్నారు. మరోవైపు, సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలను సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ ఖర్చుపెడుతోంది. ఓ వైపు పథకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ... మరోవైపు నిధులు కావాలంటే కేంద్రం ఇస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.

ఖజానా ఖాళీ అంటూనే....నెలకో పథకం కోసం కోట్లు కుమ్మరిస్తుంటే ఏపీకి నిధులు విడుదల చేయాలన్న ఆలోచన కేంద్రానికి వస్తుందా అన్న సందేహం కలుగక మానదు. ఈ నేపథ్యంలోనే బుగ్గన ప్రతిపాదనను, ఏపీ అవసరాలను కేంద్రం సీరియస్ గా పరిగణిస్తుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story
Share it