జగన్ సర్కారులో స్పెషల్.. 13 నెలల జగన్ పాలనలో 33 మంది సలహాదారులా?

By సుభాష్  Published on  11 July 2020 4:45 AM GMT
జగన్ సర్కారులో స్పెషల్.. 13 నెలల జగన్ పాలనలో 33 మంది సలహాదారులా?

ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు పదమూడు నెలలు కావొస్తోంది. ఈ స్వల్ప వ్యవధిలో రాష్ట్ర మంత్రుల కంటే ఎక్కువగా వివిధ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున సలహాదారుల్ని ఏర్పాటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏపీ సర్కారుకు సలహాలు ఇచ్చేందుకు ఉన్న వారెందరో తెలుసా? అక్షరాల 33 మంది మాత్రమే. ఇంతకీ వీరేం చేస్తారు అంటే.. ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటారని చెబుతారు.

ఒక రాష్ట్రంలోని మంత్రివర్గం కంటే సలహాదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది. లక్షల్లోజీతాలతో పాటు.. పలు వసతులుకల్పించటంతో వారి ఖర్చు తడిపి మోపెడు అన్నట్లుగా చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించి సలహాలు ఇచ్చేట్లుగా నియామకాలు అందుకున్న వారిలో ఇద్దరు.. ముగ్గురుకు తప్పించి మిగిలిన వారెవరికీ ఛాంబర్లు లేవన్న మాట వినిపిస్తోంది.

నమ్మిన వారికి జగన్ అన్యాయం చేయరన్న మాటకు తగ్గట్లే.. తనను నమ్మకున్న వారందరికి సలహాదారుల పదవులు ఇచ్చినట్లుగా చెబుతన్నారు. పేరుకు ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నప్పటికీ.. వారు ఎవరికి సలహాలు ఇవ్వాలన్న దానిపై స్పష్టత లేదంటున్నారు. ఈ సలహాదారుల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది ప్రశ్నగా మారినట్లు చెబుతున్నారు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రభుత్వానికి సలహాదారులుగా వ్యవహరిస్తున్న వారిలో చాలామంది తాము పదవుల్ని చేపట్టిన తర్వాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇప్పటివరకూ కలవలేదన్న మాట వారి మాటల్లో వినిపిస్తోంది. 33 మందిలో కేబినెట్ ర్యాంకుల్లో ఉన్న వారు పది మంది అయితే.. కేబినెట్ ర్యాంకులు లేని వారు మరో 23 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వీరికి ఇచ్చే జీతాలు.. వారు పెట్టే ఖర్చులు.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చమురు వదులుతోందన్న విమర్శ కూడా వినిపిస్తోంది. మరి.. ఈ సలహాదారుల విషయంలో జగన్ సర్కారు వ్యూహం ఏమిటన్నది అర్థం కానిదిగా మారిందంటున్నారు.

Next Story
Share it