ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వాహనాల రాకపోకల వల్ల తీవ్రంగా కాలుష్యం పెరుగుతోంది. అయితే దీనికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భారత్‌ స్టేజ్‌-6 పెట్రోలు, డీజిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ శుద్ధి చేసిన చమురు వాహనదారులకు అందుబాటులోకి రానుంది. దీనిలో సల్ఫర్‌ పరిమాణం 10 శాతం మాత్రమేనట.

బీఎస్‌-4 చమురులో సల్ఫర్‌ 50 పరిమాణం కలిగి ఉంది. దీంతో వాహనాల కాలుష్యం భారీగా పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. కొత్త చమురుకు తగినట్లుగా తయారీదారులు.. ద్విచక్రవాహనాల ఇంజిన్‌లలో మార్పులు చేశారు. ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ను నూతన చమురుకు తగినట్లుగా రూపొందించారు. ట్యాంక్‌ నుంచి నేరుగా పెట్రోల్‌ ఇంజిన్‌కు చేరేలా కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం వాహనాల ట్యాంకుల్లో కనీసం ఒక లీటర్‌ పెట్రోలు నిల్వ ఉండాలి. దీనికి అనుగుణంగా చమురు లేకపోతే.. ట్యాంక్‌ నుంచి పెట్రోల్‌ పంపింగ్‌ కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇక బీఎస్‌-6 వాహనాల్లో చౌక్‌ వ్యవస్థ కూడా తీసేసినట్లు.. దానికి సంబంధించిన నిపుణుడు ఒకరు తమకు చెప్పారని ఈనాడు పత్రిక తన కథనంలో రాసుకుంది. ఇప్పుడు వచ్చే కొత్త వాహనాల్లో శబ్దం సైతం రాదని ఆయన పేర్కొన్నాడని సమాచారం. బీఎస్‌-6 ఇంజిన్‌కు తోడుగా కొత్త చమురు కూడా మార్కెట్లోకి రావడంతో.. మైలేజీ కూడా పెరుగుతుందని తెలిసింది.

ఇప్పుడు బీఎస్‌-4 వాహనాల్లో ఈ తరహా వ్యవస్థ లేదు. దీంతో వాహనంలో ఉన్న పెట్రోల్‌ చివరి బొట్టు వరకు వాడుతున్నారు. అప్పటికి బైక్‌ స్టార్ట్‌ కాకపోతే.. చౌక్‌ను ఒక్కసారి లాగితే స్టార్ట్‌ అవుతుంది. అయితే ఇప్పటి నుంచి కొత్త వాహనాలు కొనుగొలు చేసే వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. కనీసం లీటర్‌ పెట్రోలును నిల్వ చేయాల్సి ఉంటుంది. లీటర్‌ పెట్రోల్‌ లేకపోతే బండి కదలదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.