Fact Check : దాడులు చేయడానికి ముందుగానే ఇటుకలను సిద్ధం చేసి వీధుల్లో పెట్టారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2020 8:24 AM ISTజాత్యహంకార ఘటనలకు వ్యతిరేకంగా అమెరికాలో మాత్రమే కాకుండా.. మొత్తం ప్రపంచమంతా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మిన్నీపోలిస్ పోలీసు అధికారుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు రగులుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థులపై దాడులు కూడా జరిగాయి. అమెరికాలోని చాలా నగరాల్లో 144 సెక్షన్ ను అమలు చేశారు. హింసాత్మక ఘటనల్లో పోలీసుల మీద ఇటుకలతో దాడులు చేశారు.
చాలా ప్రాంతాల్లో కొందరు ముందుగానే కొన్ని ఇటుకలను సిద్ధం చేసి పెట్టారని ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు ఆకతాయిలు, గ్రూపులు వీధుల్లోనూ, రోడ్ల ప్రక్కగా ఇటుకలను ఉంచారని.. నిరసనకారులు ఆగ్రహంతో ఉన్న సమయంలో వాటిని పోలీసుల మీదకు ఉపయోగించాలని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారంటూ పలు పోస్టులు సోషల్ మీడియా లో ఉంచారు.
పలువురు వ్యక్తులు అందుకు సంబంధించి ట్వీట్లు చేశారు. తాను ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో ఇటుకలను ఉంచారంటూ కొందరు ట్వీట్లు చేశారు. కేవలం 15 నిమిషాల దూరంలో తమకు ఆ ప్రాంతముందంటూ పలువురు పోస్టులు పెట్టారు.
“Interesting how there’s a random pile of bricks near where protests are occurring in Atlanta. This is 15 minutes from where I live.”
"అట్లాంటాలో, ఆఫ్ 400 టు ద పీచ్ ట్రీ దగ్గర ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు చోటుచేసుకోలేదని.. కానీ కొందరు ఇటుకలను ఉంచుతున్నారని.. సంఘ విద్రోహ శక్తులు దీని వెనుక ఉన్నాయి" అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
లూఠీలు, నిరసనలు తెలియజేస్తున్న వారి వెనుక కొన్ని సంఘ విద్రోహశక్తులు ఉన్నాయి.. చాలా అమెరికా నగరాల్లో ఇలాంటిదే చోటుచేసుకుంటోంది. ఈ శక్తులన్నీ కలిసి అమెరికాను నాశనం చేయాలని అనుకుంటున్నాయి. మీరు వారి ఉచ్చులో పడకండి అంటూ మరికొందరు పోస్టులు చేశారు.
కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అమెరికా లోని చాలా ప్రాంతాల్లో ఇలా ఇటుకలను ఉంచారంటూ ఆరోపిస్తూ ఫోటోలు షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
అట్లాంటా లోని పీచ్ ట్రీ రోడ్, లెనాక్స్ రోడ్ లో ఇలా రోడ్ల పక్కన ఇటుకలను ఉంచారని వచ్చిన వార్తలు 'పచ్చి అబద్దం'
11alive.com కథనాల ప్రకారం.. అక్కడ ఇటుకలు నవంబర్ 2019 నుండి ఉన్నాయట. సదరు వీధికి చెందిన గూగుల్ స్ట్రీట్ వ్యూ వీడియోను యుట్యూబ్ లో చూడొచ్చు.
ఆ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన లొకేషన్ ను సెర్చ్ చేయగా.. స్ట్రీట్ వ్యూ లో అందుకు సంబంధించిన ఫోటో లభించింది. నవంబర్ 2019 నుండి అవి అక్కడే ఉన్నాయి.
నిరసనలు తెలియజేస్తున్న వారి వెనుక కొన్ని సంఘ విద్రోహశక్తులు ఉన్నాయని.. కొందరు కావాలనే ఇటుకలను ముందస్తుగా తెచ్చి పెట్టారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.