కోట్లల్లో ధర పలుకుతున్న అరుదైన పాము

By సుభాష్  Published on  1 Jan 2020 5:29 PM IST
కోట్లల్లో ధర పలుకుతున్న అరుదైన పాము

కొన్ని అరుదైన విషరహిత పాములకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్‌ ఉంది. ఈ పామును మందులు, సౌందర్యసాధనాల తయారీలో ఉపయోగిస్తుంటారని అందరు నమ్మేది. అలాంటి పాములను కొందరు మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నస్తూ జనాలను మోసం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లా నర్సింగ్‌ గఢ్‌ లో ఐదుగురు వ్యక్తులు ఓ పామును విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెడ్‌సాండ్‌ బోవా అనే జాతికి చెందిన అరుదైన విషరహిత పామును సుమారు 1.25 కోట్లకు విక్రయిస్తుండగా, వారిని పట్టుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరుదైన విషరహిత పాము ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, సంపద కూడా చాలా వస్తుందని నమ్ముతారు. అలాగే పాములలో లైంగిక సామర్థ్యం కలిగించే గుణం ఉందని, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిని నయం చేసే గుణం ఉందని కూడా ప్రచారంలో ఉంది. ఈ పాము వల్ల ఏదో ఉపయోగం ఉందని జనాలను నమ్మిస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పామును భారీ మొత్తంలో విక్రయించేందుకు ఫోన్ లో బేరం ఆడుతుండగా పోలీసులు పట్టుకుని పామును స్వాధీనం చేసుకున్నారు. పవన్‌, శ్యామ్‌ తోపాటు మరో ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. నిందితులపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు

నిజంగానే ఈ పాముతో ఉపయోగమేనా..?

ఈ పాములు అరుదైన జాతికి చెందిన విషరహిత పాము. దీని శాస్త్రీయ నామం ఎరిక్స్‌ జాన్సీ. ఇక ఇంగ్లంలో రెడ్‌ సాండ్‌ బోవా అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఇరాన్‌, పాకిస్తాన్‌, భారతదేశంలో కనిపిస్తుంటుంది. రాజస్తాన్‌ రాష్ట్రంలో ఈ పామును బోగి అని అంటారు. ఈ రకపు పాములు పొడి వాతావరణం ఉన్న తేలికపాటి ఎడారులలోనూ, మెట్ట ప్రాంతాల్లో ఉండే రాతి ఇసుక నేలల బొరియల లోను నివసిస్తాయి. కాగా, ఇలాంటి పాముల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అదృష్టం కలిసి వస్తుందని, సంపద కూడా చాలా వస్తుందని చెప్పడం మూఢనమ్మకాలు మాత్రమేనని, జనాలను మోసం చేయడానికే ఇలాంటి ముఠాలు పుట్టుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పాము ఎలాంటి ఔషధాలలో ఉపయోగించరని చెబుతున్నారు. ఈ పాములో ఎన్నో ఉపయోగాలున్నాయని కొందరు మాయమాటలు చెబుతున్నారే తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదని, ఎవ్వరు కూడా ఇలాంటి వారికి మోసపోవద్దని స్పష్టం చేస్తున్నారు.

Next Story