చెన్నమనేని విద్యాసారగ్ రావు.. ఈయన పేరు అందరికి తెలిసిందే. ఒకప్పుడు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. అలాగే దివంగత వాజపేయి మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగి, ఆ తర్వాత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఇటీవల తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో మళ్లీ కమలం వికసించడం ఖాయమనుకున్నారు. తర్వాత చూస్తే సైలెంట్‌ అయిపోయారు. తర్వాత ఆయన ఎక్కడ కూడా కనిపించడం లేదు. కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడం లేదు. దీంతో విద్యాసారగ్‌రావు ఎందుకు సైలెంట్‌ అయిపోయారనేది రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చల జరుగుతోంది.

ఎన్నో పదవుల్లో..

చెన్నమనేని విద్యాసాగర్‌రావు బీజేపీ సీనియర్‌ నాయకుడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా,అలాగే గవర్నర్‌గా పని చేసిన వ్యక్తి. ఇక చెప్పాలంటే ఓ సమయంలో ఓ ఛానల్‌లో రాజకీయ చర్చకు యాంకర్‌గా కూడా వ్యవహరించారు కూడా. విద్యాసాగర్‌రావు కరీంనగర్‌ జిల్లాలో 1941, ఫిబ్రవరి 12న జన్మించారు. కరీంనగర్‌ జిల్లాలో ఆయనకు మంచి పేరుంది. గవర్నర్‌ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన పదవిని పొడగించకపోవడంతో తిరిగి హైదరాద్‌కు చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో మళ్లీ సభ్యత్వం స్వీకరించారు. తిరిగి రాజకీయాల్లో తన ప్రయాణం కొనసాగుతుందని ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందుకు కారణం ఏమై ఉంటుందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

స్వశక్తితో ఎదిగిన సిహెచ్‌. విద్యాసాగర్‌రావు

1977లో కరీనంగర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వశక్తితో ఎదిగిన విద్యాసాగర్‌రావు రాజకీయాలలో రాణించారు. 1980లో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలై, 1985లో ఏపీ శాసన సభ ఎన్నికలలో బీజేపీ తరపున మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లో కూడా మెట్‌పల్లి నుంచి వరుసగా విజయాలు సాధించి మూడు పర్యాయాలుగా శాసనసభ్యుడిగా కొనసాగారు. 1998లో కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 12వ  లోక్‌సభలో ప్రవేశించారు. పార్లమెంట్‌కు చెందిన పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అలాగే 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలలో కూడా గెలుపొంది కేంద్రంలో వాజపేయి నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో హోంశాఖ సమాయమంత్రిగా పని చేశారు.

బీజేపీ వ్యూహమేంటీ..?

కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి బీజేపీ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇటు మహారాష్ట్ర గవర్నర్‌గా పదవీ కాలం ముగిసిన తర్వాత విద్యాసాగర్‌రావు బీజేపీలో చురుకుగా పని చేశారు. దీంతో ఆయన కమల దళంలో కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. ఏమైందో తెలియదు కానీ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా విద్యాసాగర్‌రావు ఎక్కడా కనిపించ లేదు. సొంత జిల్లా అయిన కరీంనగర్‌లో సైతం కూడా ప్రచారం నిర్వహించలేదు. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి బీజేపీ అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఇలా ఎక్కడా మచ్చుకైన కనిపించకపోవడంతో రాజకీయాల్లో చర్చ మొదలైంది.

విద్యాసాగర్‌రావు సేవలు అవసరం

ఇక తెలంగాణలో సీనియర్ల సేవలు మరింత అవసరమని కాషాయ పార్టీ గుర్తించింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విద్యాసాగర్‌రావు సేవలు అవసరమని భావించింది. కానీ ఆయన మాత్రం బయటకు రావడం లేదు. మరి ఒక వేళ వస్తే జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారా..? లేక రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారా..? అన్నది అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద విద్యాసాగర్‌ పయనం ఎటువైపు అనే చర్చల బీజేపీ చర్చ జోరుగా కొనసాగుతోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.