సీఎం‌కు రాఖీ పంపిన ఎంపీ.. గిప్ట్‌గా ఏం కోరారంటే..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  25 July 2020 12:01 PM GMT
సీఎం‌కు రాఖీ పంపిన ఎంపీ.. గిప్ట్‌గా ఏం కోరారంటే..

రాజకీయాల్లో ఎప్పుడూ తిట్లు రాట్లు పాట్లే కాదు.. అప్పడప్పుడు కాసింత వినోదం, చమత్కారాలు కూడా ఉంటాయని చత్తీస్‌ ఘర్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ, రాజ్యసభ సభ్యురాలు సరోజ్‌పాండే చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బగేల్‌కు రాఖీతోపాటు ఓ లెటర్‌ కూడా పంపింది. ఆ లెటర్‌లోనే సీఎంను చత్తీస్‌ఘర్‌ చెల్లిగా మీకు రాఖీ పంపుతున్నాను. అన్నయ్య రాఖీ అందుకున్నాక తప్పకుండా ఓ గిఫ్ట్‌ ఇవ్వాలి. అది సంప్రదాయం. రాష్ట్రంలో మధ్యనిషేధం అమలు చేసి...అది కానుకగా ఇవ్వమని కోరింది.

‘ మీరు గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ, మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా రాసుకున్నారు అని గుర్తు చేసింది. ఎన్నికల్లో మీ హామీలు నమ్మి, మీ మాటలు నమ్మి ఛత్తీస్‌ఘర్‌ చెల్లెళ్ళు మీకు ఓటువేసి ఈ అధికారం కట్టబెట్టారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉందని గుర్తు చేస్తున్నా.. అంటూ పాండే తన ఉత్తరం ప్రారంభించింది. రాఖీ పండగనాడు చెల్లెళ్ళు తమ అన్నయ్యకు రాఖీలు కట్టేది.. తాము కోరిన కోరికల్ని అన్నయ్య తప్పకుండా తీరుస్తారనే! అందుకే మీరిచ్చే కానుక కోసం ఈ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొంది. అంతేకాదు అధికార పీఠాన్ని అందుకున్న నాయకుడు తను ఆ స్థితికి రావడానికి సహకరించిన ప్రజల అభీష్ఠాన్ని, తన హామీలను అమలు చేయడం రాజధర్మం కూడా అని కాసింత ఘాటుగానే తెలిపింది.

చెల్లి అడిగిన ఈ కోరిక తీర్చడం అన్నయ్యగా మీ బాధ్యత. ఈ రాఖీ పండగ సందర్భంగా ఛత్తీస్‌ఘర్‌ చెల్లెళ్ళకు మద్యనిషేధం అమలు రూపంగా బహుమతి ఇవ్వగలరనే అనుకుంటున్నా’ అంటూ ఓ బీజేపీ సీనియర్‌ నాయకుడు తన గొంతు కలిపాడు.

అయితే సీఎం భూషణ్‌.. మరోరీతిగా స్పందించారు. ఎంపీ సరోజ్‌పాండేకు ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించే ‘లగ్రా’ చీర కానుకగా పంపారు. ఈ సందర్భంగానే ఆయన రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటికే మద్యనిషేధ ప్రక్రియ ప్రారంభించిందని తెలిపాడు. ఆమె ఉత్తరానికి ప్రతిస్పందిస్తూ.. రాఖీ పంపినందుకు ఆనందంగా ఉంది. అయితే ప్రధానమంత్రికి, రాష్ట్ర గత ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌కు రాఖీలు పంపి వారి హామీలు కూడా గుర్తు చేసి ఉంటే మరింత ఆనందంగా ఉండేది అని వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా మద్యనిషేధం అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో ప్రజలకు వాగ్దానమిచ్చారు. అంతటితో ఆగకుండా ఇదే అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన హామీగా పెట్టారు కూడా. ఈ వాగ్దానమే కాంగ్రెస్‌కు అధికారం దక్కేలా చేసింది. తాగుడుకు బానిసలైన మగవారి వల్ల కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమయ్యాయో మహిళలకు బాగా తెలుసు. అందుకే ఈ వాగ్దానానికి మురిసిపోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. రాష్ట్రంలో దాదాపు 50శాతం మంది మహిళా ఓటర్లే ఉన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో మద్యనిషేధం అమలు ఎలా చేయాలి అన్న అంశం మీద మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీల్లో నిపుణులు, సామాజిక వర్కర్లు, లెజిస్లేటర్లు సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ కమిటీలు మద్యనిషేధ అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తాయని వివరించారు. ఏది ఏమైనా సరదాగా మొదలైన ఈ ఉత్తరాయణం కాస్త ఇరు పార్టీల మధ్య రాజకీయ దుమారమే లేపింది.

Next Story