ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా జీఎన్‌రావు కమిటీ..!
By అంజి Published on 21 Dec 2019 2:53 PM ISTవిజయవాడ: రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాజధానిపై నివేదిక సమర్పించిన కమిటీని.. జీఎన్‌రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్‌రెడ్డి కమిటీ అంటే బాగుంటుందని వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పేట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మూడు రాజధానుల అంశం టీడీపీని గందరగోళంలో నెట్టడానికి చేసిన ప్రకటనలా ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగలా లేక అధికార వికేంద్రీకరణ జరగలా అనే సందిగ్ధంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హైకోర్టును కర్నూలులో పెట్టమంటే ఆనాడు చంద్రబాబు వినలేదని గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్, చంద్రబాబులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ తమ జాగీర్ అనుకుంటున్నారని, రాష్ట్రాన్ని ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీజేపీ ఎప్పుడో చెప్పిందని దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు, నాలుగు న్యాయవాదుల భవనాలు వస్తాయన్నారు. సీఎం జగన్ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబేనన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో నాలుగు వేల ఎకరాల భూకుంభకోణం జరిగిందని వైసీపీ చెప్తోంది. మరీ కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు ఇష్టమో, కష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలో అధిక ఎమ్మెల్యేలు వైసీపీ నుంచే గెలిచారాని, రాజధాని రైతులను ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ప్రజలు పంటలు పండక ఏడుస్తుంటే, అమరావతి రైతులను మరోలా ఏడిపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా టీడీపీని ఇబ్బంది పెట్టడానికే వికేంద్రీకరణ పేరుతో మరో ఎత్తుగడ వేసిందన్నారు. హైకోర్టు ఓ ప్రాంతంలో బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారని, దానికి జీఎన్ రావు కమిటీ అవసరం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్నైనా జీఎన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు.
జీఎన్‌రావు కమిటీ చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనికి రాదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అంతే కానీ పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదన్నారు. అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలి, మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.