కొత్త టీమ్ ప్ర‌క‌టించిన న‌డ్డా.. తెలుగు రాష్ట్రాల ‌నుండి ఎవ‌రంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 11:30 AM GMT
కొత్త టీమ్ ప్ర‌క‌టించిన న‌డ్డా.. తెలుగు రాష్ట్రాల ‌నుండి ఎవ‌రంటే..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గంలో మార్పులు చేస్తూ త‌న‌ కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత జేపీ నడ్డా తొలిసారి ఈ నియామకాలు జరిపారు. మ‌రికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఈ మార్పులు చోటుచేసుకోవడం విశేషం.

అయితే కొన్ని ప్ర‌ధాన‌ పోస్టుల నుంచి కొంత‌మందిని తప్పించిన నడ్డా.. కొత్త వారికి చేటు కల్పించారు. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్(చత్తీస్‌గ‌డ్‌), ముకుల్ రాయ్(బెంగాల్‌), అన్నపూర్ణ దేవి(జార్ఖండ్‌), బైజయంత్ జే పాండా(ఒడిస్సా)లను నియమించారు.

ఇక యువ మోర్చా జాతీయ‌ అధ్యక్షుడుగా క‌ర్ణాట‌క‌కు చెందిన ఎంపీ తేజస్వి సూర్యను నియమించారు. అలాగే ఏపీ నుండి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని జాతీయ‌ ప్రధాన కార్యదర్శిగా, సత్యకుమార్ ను జాతీయ కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా డీకే అరుణ.. ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ల‌ను నియ‌మించారు.

ఇక సీనియ‌ర్లు రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్‌లను ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకువచ్చారు. మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండేను పార్టీ సెక్రటరీగా నియమించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

Next Story
Share it