వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై సినిమా.. అప్పుడే వివాదాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2020 11:57 AM ISTవైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ వారి మధ్య స్నేహం ఉండేదని చాలా మంది చెబుతూ ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పార్టీలు వేరు కాని సమయంలో చాలా స్నేహపూర్వకంగా ఉండే వారు.. ఆ తర్వాత వారి పార్టీలు ఎలా మారారు.. ఎందుకు మారారు.. ప్రత్యర్థులు ఎలా అయ్యారు అన్నదాని మీద సినిమా తీయబోతున్నామని నిర్మాత విష్ణు ఇందూరి ప్రకటించారు. రాజ్ అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారంటూ తెలిపారు.
ప్రస్థానం డైరెక్టర్ దేవా కట్టా దీనిపై స్పందించారు. ఈ ఐడియా తనదేనని.. 2015 డిసెంబర్ లో విష్ణుని కలిసినప్పుడు డిస్కస్ చేశామని అన్నారు. హిందీలో కత్రినా కైఫ్ నటించిన రాజ్ నీతి సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి విష్ణు తనతో కలిశారని దేవా కట్టా తెలిపారు. తానేమో మహాభారతం మీద తీద్దామని చెప్పినట్లు దేవా కట్టా అన్నారు.. కానీ అనుకున్నవి జరగలేదని అన్నారు. అప్పుడు తాను రెండు ఐడియాలు చెప్పానని.. ఒకటి ఎన్టీఆర్ బయోపిక్, మరొకటి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ స్నేహం మీద సినిమా అని చెప్పారు.
విష్ణు అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మీద ఆసక్తి కనబరిచాడని 2017లో డైరెక్ట్ చేయమని కోరినట్లు తెలిపారు దేవా కట్టా.. ఆ సమయానికి తాను హిందీ ప్రస్థానంకు కమిట్మెంట్ ఇవ్వడంతో అది క్రిష్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో నేను ఎటువంటి వివాదానికి తావు ఇవ్వలేదు.. ఎన్టీఆర్ బయోపిక్ ఐడియా నాదైనప్పటికీ క్రిష్ చేయడం తనకు నచ్చిందని అన్నారు. 2017లో ఆరు డిఫరెన్స్ వెర్షన్లను చంద్రబాబు-వైఎస్ఆర్ స్నేహం మీద రిజిస్టర్ కూడా చేయించానని చెప్పారు.
ఇప్పటికే విష్ణు ఇందూరి తన స్క్రిప్ట్ దొంగతనం చేసి ఒక డిజాస్టర్ ఇచ్చారని.. మళ్ళీ అలాంటి డిజాస్టర్ ని రిపీట్ కానియ్యనని అన్నారు. అవసరమైతే దాని కోసం లీగల్ గా వెళ్తానని పేర్కొన్నారు.
విష్ణు ఇందూరి మాత్రం ఆ రెండు ఐడియాలు తనవేనని చెబుతూ ఉన్నారు. 2015లో రాజ్ నీతి సినిమా కోసం దేవా కట్టాను కలిసిన మాట నిజమేనని ఆయన అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం డిస్కషన్లు జరిగినప్పుడు నేను 30 నుండి 40 సీన్లు అతడికి చెప్పాను.. కానీ అతడు ఒక్క సీన్ కూడా నాకు చెప్పలేదు అని విష్ణు ఇందూరి చెప్పారు. దేవా కట్టా ఒక్కో సారి ఒక్కో మాట చెబుతూ ఉన్నారని అన్నారు.
ట్విట్టర్ ఖాతాలో స్క్రిప్ట్ ను దొంగిలించారని అంటూనే.. బయటేమో తన ఐడియాలను కాజేశారని అంటున్నారని విష్ణు ఇందూరి తెలిపారు. తామిద్దరం ఎప్పుడూ చంద్రబాబు-వైఎస్ఆర్ స్నేహంకు సంబంధించిన సినిమాపై డిస్కషన్లు పెట్టలేదని అన్నారు. ప్రముఖ వ్యక్తుల మీద సినిమాలు తీసే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపించవచ్చు అని విష్ణు ఇందూరి తెలిపారు.