ఆ 'S' ఆకారం మలుపులే కారణం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. !

By అంజి  Published on  17 Dec 2019 10:22 AM IST
ఆ S ఆకారం మలుపులే కారణం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. !

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను సరిపడా భూసేకరణ జరపకుండానే నిర్మించారని నిపుణుల కమిటీ సోమవారం నివేదిక జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌కు సమర్పించింది. సేకరించిన స్థలంలోనే నిర్మించడం వల్ల ఫ్లైఓవర్‌ వంపులు తిరిగిందని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్మించారు. ఫ్లైఓవర్‌పై వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వేగ నిరోధకాలు, సూచికలు ఏర్పాటు చేయాలని సూచించింది. వేగంగా వెళ్లే వాహనదారులు ఈ ఫ్లైఓవర్‌ వెళ్లడం మంచిది కాదని తెలిపింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వరల్డ్‌ బ్యాంక్‌ రోడ్డు భద్రతా విభాగం సలహాదారు ఆచార్య నాగభూషణరావు, నిపుణులు డాక్టర్‌ టీఎస్‌ రెడ్డి, శ్రీనివాస్‌కుమార్‌, ప్రదీప్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నివేదికను ఇవాల మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఆ తర్వాత బయోడైవర్సిటీ ఫ్లైఒవర్‌పై వేగనిరోధక ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ నవంబర్‌ 4న అందుబాటులోకి వచ్చింది. నవంబర్‌ 9వ తేదీన ఫ్లైఓవర్‌పై సెల్ఫీతీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆ తర్వాత నవంబర్‌ 23న అతివేగం వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్‌ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఫ్లైఓవర్‌ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తీవ్ర దుమారం చెలరేగింది. ఈ రోడ్డు ప్రమాదాలను సీరియస్‌గా తీసుకున్న బల్దియా అధికారులు రహదారుల నిపుణులతో కమిటీ వేశారు.

నిపుణులు కమిటీ సభ్యులు ఫ్లైఓవర్‌పై రక్షణ చర్యలతో 100 కీ.మీ వేగంతో ఇన్నోవా కారును నడిపి ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ఇంజనీర్లు మరింత దూరదృష్టితో వ్యవహరిస్తే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తిగా ఐఆర్‌సీ ప్రమాణాల ప్రకారమే ఉందని తేల్చారు. ఫ్లైఓవర్‌పై రెండు ప్రాణాంతక మలుపులు ఉండడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలకు తావిస్తోందనని ఇంజనీర్లు ఆలోచించలేకపోయారని నిపుణులు అభిప్రాయపడ్డారు. నిబంధనలకు అణుగుణంగా నిర్మాణం చేపట్టంపై ఇంజనీర్లు దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ మొత్తం పొడవు 990 మీటర్లు ఉండగా.. 'S' ఆకారంలో రెండు చోట్ల మలుపులు ఉన్నాయి. ఈ మలుపులే ప్రమాదాలకు ప్రధాన కారణమని నివేదికలో తెలిపారు. ఫ్లైఓవర్‌పై 40 కి.మీ వేగంతో వాహనాలు వెళ్లేలా, సెల్ఫీలు తీసుకోకుండా చర్యలు, సూచికలతో పాలు నివారణ చర్యలను నిపుణుల కమిటీ సూచించింది.

Next Story