బీహార్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరాలు

By సుభాష్  Published on  21 Sept 2020 7:36 PM IST
బీహార్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరాలు

బీహార్‌ రాష్ట్రంపై ప్రధాని నరేంద్రమోదీ వరాల జల్లు కురిపించారు. అక్టోబర్‌- నవంబర్‌ నెలల్లో బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ రాష్ట్రంపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం 14,258 కోట్ల విలువైన 9 హైవే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బీహార్‌ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రధాని మోదీ 45,945 గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు కల్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బీహార్‌ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి కేంద్రం సహాయపడుతుందని హామీ ఇచ్చారు.

ఈ హైవే ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం ముఖ్యంగా రవాణా రంగంలో ఎంతగానో పురోగతి చెందుతుందని అన్నారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం లభించడం రైతులకు ఎంతో మేలవుతుందని అన్నారు. ఈ విధంగా అన్నదాతల రుణం తీర్చుకోగల్గుతున్నామని అన్నారు. ఆప్టికల్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల కారణంగా ప్రతి గ్రామంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించగలుగుతున్నామని అన్నారు. అటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు.

బీహార్‌ రాష్ట్రంలో రైల్వే వంతెనలు, మంచినీటి సరఫరా పథకాలతోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. 350 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కాగా, 9 జాతీయ రహదారుల నిర్మాణంతో బీహార్‌ రాష్ట్రానికి యూపీ జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గతంలో ప్రధాని మోదీ బీహార్‌ అభివృద్ధికి రూ. 54,700 కోట్లతో 75 ప్రాజెక్టులు చేపట్టగా, వీటిలో 13 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మిగతా 38 ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి కానున్నాయి.

Next Story