తెలంగాణలో భారీ వర్షాలు.. సెలవులన్నీ రద్దు..!

By సుభాష్  Published on  21 Sep 2020 1:39 PM GMT
తెలంగాణలో భారీ వర్షాలు.. సెలవులన్నీ రద్దు..!

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్‌. మున్సిపల్‌ అధికారులకు సెలవులు రద్దు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని పురపాలకల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

భారీ వర్షాల కారణంగా ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అన్నారు. ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతోందని మంత్రి అన్నారు. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ వర్షాలు కురియలేదని, ఒక్క హైదరాబాద్‌లోనే గత పది రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు.

వర్షాల కారణంగా చెడిపోతున్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.

Next Story