ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవాలని భారతీయులు ఫిక్స్ అయ్యేలా బిడెన్ నోటి మాట
By సుభాష్ Published on 3 July 2020 8:02 AM GMTమరికొద్ది నెలల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నిల ప్రచారం ఇప్పటికే వేడెక్కింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారికి మాత్రం ట్రంప్ దేశాధ్యక్షుడు కాకూడదని ఫిక్స్ అయినోళ్లు ఎంతోమంది ఉన్నారు. మహమ్మారి విషయంలో ఆయన అనుసరించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఆయనపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ.. ఆయన రాజకీయ ప్రత్యర్థి.. అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ నోట కీలక వ్యాఖ్యలు ఒకటి తాజాగా వచ్చింది.
ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ.. అందరిని కలుపుకుపోయేలా ఆయన హామీల్ని గుప్పిస్తున్నారు. ట్రంప్ మాదిరి కాకుండా అందరికి అండగా ఉంటానన్న తీరులో ఆయన మాటలు ఉంటున్నాయి. తాజాగా భారతీయులు ఫిదా అయ్యే మాట ఆయన నోటి వెంట వచ్చింది. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికా సహజ భాగస్వామి భారత్ తో వ్యూహాత్మక సంబంధాల్ని మరింత దృఢతరం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
హెచ్ 1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయటంతో పాటు ఇమిగ్రేషన్ వ్యవస్థను ఆధునీకరిస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్ లైన్ పద్దతిలో జరిగిన ఒక టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్లతో పాటు పలు అంశాల్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. హెచ్ 1బీ వీసాల్ని ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది మొత్తానికి రద్దు చేశారని.. తమ ప్రభుత్వంలో మాత్రం అలా జరగదన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లో వీసాలపై నిషేధాన్ని ఎత్తి వేస్తానని చెప్పిన ఆయన మాట భారతీయుల మనసుల్ని దోచేలా ఉందని చెప్పాలి.
దేశంలో తగిన పత్రాలు లేని కోటీ పది లక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరతానని.. ఇందులో 17 లక్షల మంది ఏషియన్ అమెరికన్లు.. పసిఫిక్ఐలాండర్లు ఉంటారని చెప్పారు. మొత్తానికి ట్రంప్ ఎవరినైతే కాదనుకుంటున్నారో.. ఎవరి ప్రయోజనాల్ని దెబ్బ తీయాలని టార్గెట్ చేశారో.. అలాంటి వర్గాలను సమీకరించేలా బిడెన్ మాటలు ఉండటం గమనార్హం. మొత్తానికి తన మాటలతో భారతీయుల మనసుల్ని దోచేయటమే కాదు.. ట్రంప్ ఓడిపోవాలని అందరూ అనుకునేలా జో బిడెన్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.