సారుకు రావాల్సిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్న కిషన్ రెడ్డి

By సుభాష్  Published on  3 July 2020 7:49 AM GMT
సారుకు రావాల్సిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్న కిషన్ రెడ్డి

ఆలోచనలు మస్తు ఉండొచ్చు. ఆచరణ ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. మదిలో ఉన్న ఆలోచనల్ని అదే పనిగా చెప్పుకుపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చేతల్లో చేసి చూపిస్తేనే ప్రయోజనమన్న మాట.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్థమయ్యేలా చేసి.. షాకిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఉన్నట్లుండి పీవీ శతజయంతి ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారీగా నిర్వహించనుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా మొన్న ఆదివారం హైదరాబాద్ లో పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఘనంగా షురూ చేశారు. నోరారా పొగిడేశారు కూడా.

తెలంగాణకు చెందిన వ్యక్తి అన్న మాట తప్పించి.. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని పీవీని.. కేసీఆర్ పొగిడేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమైనా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన శతజయంతిని భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేయటం పలువురి మనసుల్ని దోచేలా చేసింది. అదే సమయంలో.. పీవీని గుర్తించేందుకు తెలంగాణ కమలనాథులు వేసిన ఎత్తుల్ని కేసీఆర్ తనదైన శైలిలో చిత్తు చేశారని చెప్పాలి.

ఈ క్రమంలో కేసీఆర్ కు షాకిచ్చేలా చేశారు కిషన్ రెడ్డి. పీవీ నరసింహారావు పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామని సీఎం కేసీఆర్ చెబితే.. తనకున్న పలుకుబడితో రోజుల వ్యవధిలో పీవీ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం తాజాగా ప్రకటించేలా పావులుకదిపారు కిషన్ రెడ్డి. పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్ర కమ్యునికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు కిషన్ రెడ్డి ప్రతిపాదన పంపగా.. ఆయన వెంటనే ఓకే చేశారు. దీంతో.. కేంద్రమంత్రికి కృతజ్ఞతలు చెబుతూ కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

త్వరలోనే పీవీ స్టాంప్ విడుదల కానుందని కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించటం ద్వారా.. ఆయన్ను తమ ఖాతాలోకి వేసుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్న వేళలో.. అలాంటి పప్పులేమీ ఉడకవని.. తమకూ స్టేక్ కావాలన్న విషయాన్ని కిషన్ రెడ్డి తన చేతల్లో చేసి చూపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. పీవీ స్టాంప్ విషయంలో కేసీఆర్ కు రావాల్సిన మైలేజీని కిషన్ రెడ్డి హైజాక్ చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.

Next Story