ద్రోహుల పని పడతాం : మల్లు భట్టి విక్రమార్క
By Medi Samrat Published on 29 July 2020 6:51 PM ISTమణుగూరు : ఒక ద్రోహి మరో ద్రోహితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు రాత్రికిరాత్రి రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడంపై మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మణుగూరులో కాంగ్రెస్ నాయకుల చేపట్టిన నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్కతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజే కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎక్కడో టీచర్ గా పని చేస్తున్న రేగా కాంతారావును.. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ ఫిరాయించి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ద్రోహి రేగా కాంతారావు.. తెలంగాణ ఇస్తే.. పార్టీని విలీనం చేస్తానని చెప్పి మోసం చేసిన మరో ద్రోహి కేసీఆర్‌తో కలిసి స్వాంతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని మండాపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటే డబ్బుతోనో, స్థలం విలువతొనో చూసేది కాదని.. అదొక భావోద్వేగ స్థలమని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన.. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి ఎందరో మహానాయకులను అందించిన పార్టీ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన వారికి చట్టపరంగానే బుద్ధి చెవుతామని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు.