చైనా కంపెనీలు భారత్ యూత్‌ను ఇలా టార్గెట్ చేశాయా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 11:40 AM GMT
చైనా కంపెనీలు భారత్ యూత్‌ను ఇలా టార్గెట్ చేశాయా?

భారతదేశమంటే చాలు అదే పనిగా అక్కసు ప్రదర్శించే డ్రాగన్ దేశం గురించి తెలుసు. నిత్యం భారత్ మీద ఏడ్చే ఆ దేశం.. అవకాశం వచ్చిన ప్రతిసారీ దేశాన్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా దేశాన్ని దెబ్బ తీయాలన్న కుయుక్తి.. డ్రాగన్ దేశానికి ఉంటే.. మరోవైపు ఆ దేశ కంపెనీలు భారత యువత మీద కన్నేశారా? అంటే అవునని చెప్పాలి.

కొత్త తరహాలో భారత యువతను దెబ్బ తీసేందుకు ఆ దేశానికి చెందిన కంపెనీలు పన్నుతున్న కుయుక్తుల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.కలర్ ప్రెడిక్షన్ కింద సింఫుల్ గా కనిపించే ఒక గేమ్ ను ఆన్ లైన్ లో వదిలిన ఆ దేశం.. పలు ఎత్తులతో లక్షలాది మందిని దొంగ దెబ్బ తీస్తోంది. డబ్బుల ఆశ చూపించి వల విసిరి.. వారిని ముగ్గులోకి దించి.. అదే పనిగా వసూళ్లు చేసి.. చివర్లో మోసం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇలాంటి పనులతో ఒక రెండు కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.1100 కోట్ల మేర లావాదేవీలు జరిపిన వైనం చూస్తే.. ఇదెంత పెద్ద రాకెట్ అన్నది ఇట్టే అర్థం కాక మానదు.డ్రాగన్ దేశానికి చెందిన కంపెనీలు వేసిన ఎత్తుల్ని హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా ఛేధించటమే కాదు.. చైనాకు చెందిన ఒక వ్యక్తితో పాటు.. కొందరు దేశీయుల్ని వ్యాపార భాగస్వామ్యులుగా చేసుకొని కోట్లాది రూపాయిలు కొల్లగొడుతున్న వైనాన్ని గుర్తించారు.

ఇద్దరు ఆన్ లైన్ బాధితుల నుంచి ఫిర్యాదులతో అలెర్టు అయిన హైదరాబాద్ పోలీసులు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్లైంది. పక్కా ప్లానింగ్ తో చేస్తున్న ఈ ప్రయత్నాలకు ప్రధానకేంద్రం చైనాగా గుర్తించారు. తమ దర్యాప్తులో.. ఇలాంటి దొంగ కంపెనీలు వందల్లో ఉన్నట్లు గుర్తించామని.. వెబ్ సైట్ల సర్వర్లు అన్ని చైనాలో ఉన్నాయని..చైనా నుంచి నియంత్రించేలా క్లౌడ్ సర్వర్లు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఏమైనా.. డ్రాగన్ దేశమే కాదు.. ఆ దేశ కంపెనీలు సైతం మనోళ్లను దొంగదెబ్బ తీయటానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఎదుర్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story