సంగారెడ్డిలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2020 12:42 PM ISTమహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి వారికి రక్షణలేకుండా పోయింది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ అనాథాశ్రమంలో దారుణం జరిగింది. అనాథపిల్లలను చేరదీశామనే పేరుతో వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. 14ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసిన ఆశ్రమ నిర్వాహకుడు ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర ఆనారోగ్యానికి గురైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించింది.
వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన బాలిక.. తల్లిదండ్రులు మరణించడంతో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని ఓ అనాథాశ్రమంలో బంధువులు చేర్పించారు. ఆశ్రమంలోనే బాలిక ఐదో తరగతి వరకు చదివింది. గత సంవత్సర కాలంగా వేణుగోపాల్ అనే వ్యక్తి ఆ బాలికకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బాలికను బెదిరించాడు. అతడికి ఆశ్రమ వార్డెన్ సహకరించింది. దీంతో బాలిక భయపడి తనపై జరుగుతున్న దారుణాన్ని ఎవ్వరికి చెప్పకుండా ఉండిపోయింది.
బోయినపల్లిలోని తమ బంధువుల ఇంటికి వచ్చిన క్రమంలో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయట పడింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. బాలిక పిన్ని ఆశ్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఆశ్రమ నిర్వాహకుడితో పాటుగా, వార్డెన్‌ను అరెస్టు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. బుధవారం కన్నుమూసింది. కాగా.. ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయ్యింది. నలుగురు సభ్యులతో ఓ కమిటీ వేసి పూర్తి స్థాయి నివేదికను ఆగస్టు 20లోపు ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసింది.