సింగర్ సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్లు టోకరా
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 1:51 PM ISTప్రముఖ సింగర్ సునీత పేరిట కొందరు కేటుగాళ్లు ఏకంగా 1.7కోట్లు టోకరా వేశారు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఇప్పటికే తాను సునీత మేనల్లుడినని చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడిన చైతన్య అనే వ్యక్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన మరో మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది.
కొత్తపేటకు చెందిన ఓ మహిళ.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయని సునీతకు వీరాభిమాని. 2019లో బాధితురాలు ఇంటి దగ్గర ఉండే చైతన్య అనే వ్యక్తి... సింగర్‌కు చెందిన వాట్సప్ నెంబర్ ఇదేనని ఓ నెంబర్‌ను ఆమెకు ఇచ్చాడు. దీంతో రెండు మూడు సార్లు మెసేజ్ చేయగా.. మహిళ నెంబర్‌ను బ్లాక్ చేశారు. ఆ మహిళ మరో నెంబర్ నుంచి సునీత నెంబర్ అంటూ ఇచ్చిన నెంబర్‌కి 'మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి' అంటూ మెసేజ్ పెట్టింది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు బాధితురాలిని నమ్మించి మోసం చేశారు.
ఒక రోజు కేరళలో ఆనంద చేర్లాయం ట్రస్ట్ లో రూ. 50వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పగా నమ్మి రూ.50 వేలు చెల్లించింది. అలాగే భూముల అమ్మకాలంటూ.. నమ్మించి రూ.1.7 కోట్లను వసూలు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా గాయని వాట్సప్ వీడియో కాల్ చేసినా లిఫ్ట్ చేయక పోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. ఆ నెంబర్‌పై కూపీ లాగగా.. అది సింగర్‌ది కాదని.. తాను మోసపోయానని గాయని వాట్సాప్ నంబర్ ఇచ్చిన చైతన్య మీద ఆమె చీటింగ్ కేసు పెట్టింది.