ఆసీస్ టూర్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. హిట్ మ్యాన్ లేకుండానే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 12:55 PM IST
ఆసీస్ టూర్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌.. హిట్ మ్యాన్ లేకుండానే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(బీసీసీఐ) ప్ర‌క‌టించింది. సోమ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశమైన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ విరాట్ నేతృత్వంలోని వ‌న్డే, టీ20, టెస్ట్ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ఐపీఎల్‌లో గాయ‌ప‌డిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఈ ప‌ర్య‌ట‌న మొత్తానికే దూర‌మ‌య్యాడు. తొడ కండ‌రాల గాయం తిర‌గ‌బెట్ట‌డంతో.. ముంబై ఇండియ‌న్స్ ఆడిన గ‌త రెండు మ్యాచ్‌ల‌కు దూరం అయిన రోహిత్ శ‌ర్మ‌.. మిగిలిన మ్యాచ్‌ల‌కూ ఆడే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్‌గిల్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

ఊహించన విధంగానే యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై వేటు పడింది. వన్డే, టీ20 జట్లకు అతన్ని ఎంపిక చేయని సెలెక్షన్ కమిటీ టెస్ట్ టీమ్‌లో అవకాశం కల్పించింది. మయాంక్ అగర్వాల్‌, కేఎల్ రాహుల్‌లకు మూడు ఫార్మాట్లలో చోటు దక్కింది. ఇక సంజూ శాంసన్‌కు టీ20 జట్టులో అవకాశం లభించింది. ఇక సీనియ‌ర్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ ప‌రిస్థితిని బీసీసీఐ వైద్య బృందం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌నుంది. ప్ర‌స్తుతానికి అత‌డికి జ‌ట్టులో చోటివ్వ‌లేదు. ఇషాంత్ కోలుకుంటే టెస్ట్ జట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే పరిమిత ఓవర్లలో వికెట్ కీపర్ కూడా రాహుల్ సేవలందించనున్నాడు.

ఐపీఎల్‌లో 5 వికెట్లతో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి టీ20 జట్టులో అవకాశం దక్కింది. టెస్ట్‌ల్లో మాత్రం అజింక్యా రహానేనే వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు ఐపీఎల్ ముగియగానే నే రుగా ఆసీస్‌కు వెళ్లనుంది. దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుంధర్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి

భారత వన్డే జ‌ట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్

భారత టెస్ట్ జ‌ట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్(కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్

Next Story