బెన్ స్టోక్స్‌ అరుదైన ఘనత.. చేద‌న‌లో రెండు శ‌త‌కాలు చేసిన ఒకే ఒక్క‌డు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 10:43 AM GMT
బెన్ స్టోక్స్‌ అరుదైన ఘనత.. చేద‌న‌లో రెండు శ‌త‌కాలు చేసిన ఒకే ఒక్క‌డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)2020 సీజ‌న్ అంచ‌నాల‌కు అంద‌కుండా సాగుతోంది. ఉత్కంఠ మ్యాచులు, సూప‌ర్ ఓవ‌ర్ మ్యాచ్‌ల‌తో అభిమానుల‌కు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. ప్లే ఆప్స్ కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ మిన‌హా అన్ని జట్లు రేసులో ఉన్నాయి. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ (107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వీర‌విహారంతో రాజ‌స్థాన్.. ముంబై పై విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఐదు విజ‌యాలు సాధించిన రాజ‌స్థాన్ 10 పాయింట్ల‌తో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

రాజ‌స్థాన్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన బెన్‌స్టోక్స్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంత‌రం స్టోక్స్ మాట్లాడాడు. ముంబై లాంటి జట్టు ఓడించడం మనకు నమ్మకాన్ని పెంచుతుందని.. ముంబై 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే అంటూ చెప్పుకొచ్చాడు. ‘ముంబై వంటి మంచి జట్టును ఓడించడం చాలా గోప్ప విచయం. దాని వల్ల మనలోని నమ్మకం మరింత ఎక్కవవుతుంది. అంతేకాకుండా మేము మొదటి రెండు మ్యాచులు గెలస్తామని అనుకోలేదు. నేను ఇప్పటికీ అది నమ్మలేక పోతున్నా. అయితే ఇప్పడు ప్లేఆఫ్‌కు చేరాలంటే ఆడబోయే ప్రతీ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంద’ని అన్నాడు.

అరుదైన ఘ‌న‌త..

రాజస్తాన్‌ రాయల్స్ బ్యాట్సమన్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఘనత సాధించాడు. సరిగ్గా ఇలాంటి ఫీట్‌నే 2017 ఐపీఎల్‌ సీజన్‌లోనూ నమోదు చేశాడు. గుజరాత్‌ లయన్స్‌ (జీఎల్‌)తో జరిగిన అప్పటి మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌(ఆర్‌పీఎస్‌) తరపున ఛేజింగ్‌కు దిగిన అజేయ శతకం(103)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఛేజింగ్‌లో స్టోక్స్‌ రెండుసార్లు సెంచరీలు కొట్టగా రెండుసార్లూ ఆయా జట్లు గెలిచాయి. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ సునాయాసంగా ఛేదించింది. 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ బెన్‌ స్టోక్స్ మెరుపు శతకం (107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. బౌండరీలతో విరుచుకుపడి 59 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ ప్యాటిన్‌సన్‌ వేసిన 19వ ఓవర్‌ మొదటి బంతికి సిక్స్ బాది సెంచరీ చేశాడు. మరోవైపు సంజూ శాంసన్‌ కూడా హాఫ్ సెంచరీ (54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఇద్దరు చెలరేగడంతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Next Story