పంజాబ్ పాంచ్ ప‌టాకా.. ప్లే ఆఫ్ల్స్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 6:53 AM GMT
పంజాబ్ పాంచ్ ప‌టాకా.. ప్లే ఆఫ్ల్స్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ అద్భుతంగా ఆడుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్ర‌తి మ్యాచ్ త‌ప్ప‌ని స‌రిగా గెల‌వాల్సిన వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ జ‌ట్టు ఆట తీరే మారిపోయింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓట‌ముల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ఉన్న పంజాబ్‌.. ఆ త‌రువాత వ‌రుస‌గా అయిదో విజ‌యంతో ప్లే ఆఫ్స్ కు గ‌ట్టి పోటిదారుగా మారింది. ఆల్‌రౌండ్ ఆధిప‌త్యంతో కోల్‌క‌త్తాను మ‌ట్టిక‌రిపించింది. 12 మ్యాచ్‌ల్లో ఆరో విజ‌యం సాధించిన ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం నాలుగో స్థానంలో నిలిచింది.

సోమ‌వారం రాత్రి కోల్‌క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌తో కేకేఆర్‌ను క‌ట్ట‌డి చేసిన పంజాబ్‌.. ఆ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌, మన్‌దీప్‌ సింగ్‌ సూపర్‌ పార్ట్‌నర్‌షిప్‌తో సూనాయాసంగా విజయం సాధించింది. నైట్‌రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 150 పరుగుల లక్ష్యఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇరగదీసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌త్తా 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్ నితీశ్ రాణా(0) ను మాక్స్‌వెల్ ఔట్ చేయ‌గా.. ష‌మి త‌న ప‌దునైన పేస్‌తో త్రిపాఠి(7), కార్తీక్‌(0)ల‌ను వెన‌క్కి పంపాడు. దీంతో కోల్‌క‌త్తా 10 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ (57; 45 బంతుల్లో 3పోర్లు, 6 సిక్స‌ర్లు), కెప్టెన్ మోర్గాన్ (40; 25బంతుల్లో 5 పోర్లు, 2 సిక్స‌ర్లు) పంజాబ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడి చేశారు. దీంతో కోల్‌క‌త్తా కోలుకుంది. అయితే.. ప‌దో ఓవ‌ర్లో బిష్ణోయ్.. మోర్గాన్‌ను పెవిలియ‌న్‌కు చేర్చ‌డంతో.. మ్యాచ్ గ‌మ‌నం మారిపోయింది. ఆత‌రువాత బౌల‌ర్లు బ‌త్తిడి పెంచ‌డంతో ప‌రుగులు రావ‌డ‌మే క‌ష్టంగా మారింది. చివ‌ర‌ల్లో ఫెర్గూస‌న్‌(24 నాటౌట్; 13 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స‌ర్‌) బ్యాట్ ఝ‌ళిపించ‌డంతో కోల్‌క‌త్తా ఆ మాత్రం స్కోరైనా చేయ‌గ‌లిగింది.

గాయం కారణంగా మయాంక్‌ దూరమైనా.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్; 56 బంతుల్లో 8 పోర్లు, 2 సిక్స‌ర్లు) కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌(28)కు చక్కటి సహకారం అందించాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక రాహుల్‌ ఔటైనా.. గేల్ (51; 29 బంతుల్లో 2 పోర్లు, 5 సిక్స‌ర్లు) రాకతో కోల్‌కతా కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వరుణ్‌ చక్రవర్తి ఓవర్‌లో 2 సిక్సర్లతో దంచుడు మొదలెట్టిన గేల్‌.. నరైన్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో మన్‌దీప్‌ నిలకడగా ఆడటంతో చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. దీంతో పంజాబ్ ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి చేదించింది. సిక్స‌ర్ల‌తో వీర‌విహారం చేసిన గేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Next Story