రానున్న రోజుల్లో ప్రభుత్వ బ్యాంకులు ఐదే.. మిగిలివని?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2020 10:52 AM ISTఅనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మోదీ సర్కారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పీటముడులు పడిన ఎన్నో సమస్యలకు తన రెండో టర్మ్ లో ఒకటి తర్వాత ఒకటి చొప్పున కీలక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మోదీ వెనుకనే దేశ ప్రజలు నిలిచారు. ఆయనేం చేసినా.. సరే అన్నారు. అయినప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థలో మాత్రం మార్పు రాలేదు. అదే సమయంలో కరోనా సవాలు నేపథ్యంలో కొత్త ఆందోళన షురూ అయ్యింది.
ఇదిలా ఉంటే.. మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాస్తా ఐదుకు మాత్రమే ఉంచుకొని.. మిగిలిన ఏడింటిని ప్రైవేటీకరణ చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులుగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. యూకో బ్యాంకుల్లోని తన వాటాల్ని విక్రయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మధ్యనే కొన్ని బ్యాంకుల్ని విలీనం చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ప్రభుత్వ వాటాను అమ్మకాలకు పెట్టాలన్న యోచన ఎందుకన్న అంశానికి కొత్త వాదనను వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి గుదిబండలా మారుతున్న మొండి బకాయిలకు కళ్లాలు వేసేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో రానున్న రోజుల్లో మొండి బకాయిల బాధ మరింత పెరిగే వీలుందని.. దాని నుంచి బయటపడేందుకు వీలుగా మోదీ సర్కారు తన వాటాల్ని అమ్మేసుకోవటం ద్వారా తనపై పడే భారాన్ని తగ్గించుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి 11.6 శాతానికి పెరిగిన బ్యాంకింగ్ రంగ మొండి బకాయిలు 2020 మార్చి నాటికి 8.5 శాతానికి తగ్గాయి.
అయితే.. కరోనా పుణ్యమా అని వచ్చే ఏడాది మార్చికి ఇది 13 శాతం నుంచి 14 శాతానికి చేరే వీలుందని భావిస్తున్నారు. మార్చి నుంచి మొదలైన మారిటోరియం ఆగస్టు 31తో ముగియనుంది. మారిటోరియం ఒక్కసారి ముగిశాక.. ఈఎంఐల డిఫాల్ట్ ల సంఖ్య ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న చాలామంది మొండి బకాయిల జాబితాలో చేరే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే.. ఆ సమస్య నుంచి తప్పించుకోవటంతో పాటు.. వాటాల అమ్మకాల ద్వారా మరిన్ని నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.