రైతులకు రుణాలు ఇవ్వండి.. బ్యాంకర్లు మానవతా దృక్ఫథంతో ఉండాలి
By అంజి
అమరావతి: కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకు రావాలి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సచివాలయంలో 210వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద ఎంఎస్‌ఎసంఈలకు, ప్రధానమంత్రి ముద్రయోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఇచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరి ఒకటిలో ఉన్న ఆరు జిల్లాల్లో ఒకలా, మిగిలిన ఏడు జిల్లాలో ఇంకోలా వడ్డీ రేట్లున్నాయన్నారు. బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయన్న ఆయన.. 12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వసూలు చేయడం ఆలోచించదగ్గ విషయమన్నారు.
Also Read: విజయదేవరకొండ ఫస్ట్.. ఎన్టీఆర్ లాస్ట్
కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు. గ్రామల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీష్ మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో మార్పులు చేపట్టామన్నారు.
Also Read: పడిపోతున్న బంగారం ధరలు.. త్వరపడండి..
రైతు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. తాను ఆశించిన ధర రాకపోతే రైతులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తారన్నారు. ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్‌లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ తెలిపారు.