ఈఎంఐల మారటోరియంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోండి: సుప్రీం
By సుభాష్ Published on 10 Sep 2020 10:02 AM GMTబ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారి ఈఎంఐలపై మారటోరియం విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు వారాల గడువు ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు చేయడం సరైంది కాదని సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రుణాలు తీసుకున్నవారిపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది.
ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సుప్రీం.. ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు ఎలాంటి భారం మోపకుండా పరిష్కారంతో అఫిడవిట్ సమర్పించాలని తెలిపింది. మరో వైపు సెప్టెంబర్ చివరి వారంలోకేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యే వరకు ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాధిస్తున్నాయి.
కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్‌బీఐ రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల పాటు మారటోరియం ప్రకటించి ఆపై ఆగస్టు 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.