బండ్ల గణేష్ సీరియస్ కామెడీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 2:38 PM IST
బండ్ల గణేష్ సీరియస్ కామెడీ

బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అయిపోయాడు గత ఏడాది. నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను 7 ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బండ్ల సవాలు విసిరాడు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్లా పడితే ఏం మాట్లాడాలో బండ్లకు అర్థం కాలేదు. కొందరు మీడియా వాళ్లు బ్లేడుతో గొంతు కోసుకోవడంపై అడిగితే.. ఎన్నో అంటాం అన్నీ చేస్తామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు బండ్ల.

ఈ ‘బండ్ల-బ్లేడు’ కాన్సెప్ట్ మీద ఎన్ని జోకులు పేలాయో.. ఎంత ట్రోలింగ్ నడిచిందో అందరికీ తెలిసిందే. దీని స్ఫూర్తితో ‘సరిలేరు నీకెవ్వరు’లో బండ్లను బ్లేడు బాబుగా చూపిస్తూ కామెడీ చేయించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇలా తనపై తానే జోకులేసుకుని ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసేసినట్లు కనిపించాడు బండ్ల.

ఐతే ఇప్పుడు ఓ సీరియస్ విషయంలోనూ బండ్ల ‘బ్లేడ్’ జోక్ వేయడం విశేషం. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. మన దేశం, మన జనాలు కూడా అందుకు మినహాయింపు కాదు. బండ్ల గణేష్ సినిమాల నిర్మాణం వదిలేసి.. తన తండ్రి కాలం నుంచి వారసత్వంగా వస్తున్న పౌల్ట్రీ వ్యాపారాన్ని సీరియస్‌గా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రంగం కూడా కరోనా కారణంగా దారుణంగా దెబ్బ తింది.



ఈ నేపథ్యంలో నిలువుగా ఉన్న బ్లేడ్ మీద నత్త పాకుతూ వెళ్తున్న ఫొటో పెట్టి.. వ్యాపారస్థుల పరిస్థితి ఈ నత్తలా ఉందని అన్నాడు బండ్ల. ముందుకు వెళ్లలేం, వెనక్కి వెళ్లలేం.. ఉన్న చోటా ఎక్కువ సేపు ఉండలేం.. అంటూ తమ పరిస్థితి ఆవేదనభరితంగా చెప్పాడు బండ్ల. కాకపోతే ఇక్కడ కూడా ‘బ్లేడ్’ను తీసుకురావడంతో దీన్ని కూడా జోక్ లాగా తీసుకుంటున్నారు నెటిజన్లు.

Next Story