సుశాంత్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 8:35 AM GMT
సుశాంత్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఎంత మంచివాడో.. అతడిలో ఎన్ని విభిన్న కోణాలు ఉన్నాయో.. అతను చనిపోయాకే ఎక్కువగా తెలుస్తోంది. చనిపోవడానికి ముందు సుశాంత్ మంచి నటుడు మాత్రమే. కానీ ఇప్పుడు అతను గొప్ప వ్యక్తి అనే సంగతి ఎంతోమంది ఉదాహరణల ద్వారా తెలియజేస్తున్నారు.

ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరవుతున్న సుశాంత్.. అప్పటిదాకా మిగతా సెలబ్రెటీలు అసలు లెక్క చేయని పేద జనాల్ని దగ్గరికి తీసుకుని వాళ్లతో ఫొటోలు దిగిన వీడియో ఒకటి ఇంతకుముందే బయటికి వచ్చింది. ఇలాంటి మరెన్నో ఉదంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూశాం. ఓ టీవీ నటిలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించిన వాట్సాప్ చాట్ సైతం వైరల్ అయింది. ఇక సుశాంత్‌ చివరి సినిమా ‘దిల్ బేచరా’ను డైరెక్ట్ చేసిన ముకేష్ చబ్రా.. అతడి మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

సుశాంత్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కై పో చే’ నుంచే అతడికి, ముకేష్‌కు పరిచయం ఉందట. ఆ చిత్రానికి ముకేష్ దర్శకత్వ శాఖలో పని చేశాడట. అప్పట్నుంచి తనను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడని.. ఎప్పటికైనా తన సినిమాతోనే దర్శకుణ్ని చేస్తానని హామీ ఇచ్చిన సుశాంత్.. అన్నట్లుగానే ‘దిల్ బేచరా’తో తనను దర్శకుడిగా పరిచయం చేసినట్లు ముకేష్ వెల్లడించాడు.

ఐతే ఈ సినిమా విడుదల సమయానికి సుశాంత్ తమతో ఉండడని ఏమాత్రం ఊహించలేదని.. తనతో కలిసి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోవడం వేదన కలిగిస్తోందని ముకేష్ అన్నాడు. ‘దిల్ బేచరా’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ చూసేలా చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పిన ముకేష్ చబ్రా.. పై నుంచి సుశాంత్ తనకే సొంతమైన అందమైన చిరునవ్వుతో తమను ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నట్లు ముకేష్ తెలిపాడు. ‘దిల్ బేచరా’ జులై 24 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.

Next Story