ఏపీలో ప్రభుత్వం ఐదేళ్లుండదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 10:33 AM GMT
ఏపీలో ప్రభుత్వం ఐదేళ్లుండదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పార్టీ అధికారంలోంచి పోయాక సైలెంటుగా ఉన్న నందమూరి బాలకృష్ణ మొదటి సారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ సర్కారు ఐదేళ్లు అధికారంలో ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందన్నారు. కొన్ని ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తుందని, అధికార పార్టీ వ్యవహారతీరు దారుణంగా ఉందని బాలకృష్ణ విమర్శించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.

మహానాడు వెబినార్ లో రెండో రోజు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ వారసులు తాము కాదని, టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్ వారసులు అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బలం కార్యకర్తలే అన్న బాలయ్య తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు మరే పార్టీకి లేరన్నారు. పార్టీ ని నిలబెడుతున్న కార్యకర్తలకే నా జీవితం అంకితం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

జగన్ పాలన అరాచక పాలన అంతం చేయడానికి ఐదేళ్లు అవసరం లేదని బాలకృష్ణ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అవసరం ఉన్నపుడు ఎక్కడ అంటే అక్కడ తాను ప్రత్యక్షం అవుతాను అన్నారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసమని, అధికారం కోసం కాదని బాలకృష్ణ ఉద్గాటించారు.

తెలుగు జాతీ నిర్వీర్యమై దిక్కుతోచని స్థితిలో మద్రాసీలుగా పిలబడుతున్న క్రమంలో ఆ అరాచకాన్ని మార్చడానికి ఎన్టీఆర్ రంగప్రవేశం చేశారన్నారు. తెలుగు వాడికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నందమూరి తారకరామారావు దిక్సూచి వంటి వారు అని బాలకృష్ణ అన్నారు. తెలుగు వాడు తలెత్తుకు జీవించేేలా చేసిన ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు పండగ రోజు అన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. మరి బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story