జగన్ చేసిన పనితో ఆదా రూ.782 కోట్లు..నష్టం రూ.7800 కోట్లా?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 9:49 AM GMT
జగన్ చేసిన పనితో ఆదా రూ.782 కోట్లు..నష్టం రూ.7800 కోట్లా?

అదే పనిగా రొడ్డు కొట్టుడు విమర్శలు.. ఆరోపణలు ఎన్ని చేసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? ప్రజల్ని టచ్ చేసేలా.. వారికి ఆసక్తి రేకెత్తించే పాయింట్లను ప్రస్తావిస్తే కలిగే ప్రయోజనం ఏమిటన్నది తాజాగా నిర్వహించిన మహానాడులో కనిపించిందని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే విషయాలపై బాబు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.

ఏపీలో తాము అధికారంలోకి వచ్చినంతనే రివర్సు టెండరింగ్ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తాము అనుసరిస్తున్న ఈ విధానం కారణంగా వందలాది కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతున్నట్లు జగన్ చెప్పుకున్నారు. ఈ విధానంలో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాల్లో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించేవారు. రివర్సు టెండరింగ్ తో తాము రూ.782 కోట్లు రాష్ట్రానికి ఆదా చేసినట్లుగా జగన్ చెప్పుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

రివర్సు టెండర్ల విధానంలో పోలవరం ప్రాజెక్టుకు ఏపీకి జరిగిన లాభం వెనుక చీకటి నష్టం ఒకటి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నది బాబు వాదన. రివర్సు టెండరింగ్ పేరుతో తీసుకున్న నిర్ణయంతో.. వాయు వేగంతో జరుగుతున్న పనులు నిలిచాయని.. దీని కారణంగా 28 నెలలు ప్రాజెక్టు ఆలస్యం కానున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం రూ.7800 కోట్లుగా వెల్లడించారు. జగన్ మీద తీవ్రమైన ఆరోపణ చేయటమే కాదు.. తన మీద వేసిన మరకను ప్రస్తావించారు.

పోలవరంలో రూ.25వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ చెప్పారని.. మరేం తగ్గించారు? విచారణ ఏం చేశారు? అవినీతిని ఎందుకు బయటపెట్టలేకపోయారంటూ ప్రశ్నల పరంపరను సంధించారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో పలు పనుల విషయంలో రివర్సు టెండరింగ్ విధానాన్ని అనుసరించిన జగన్ తీరు సంచలనంగా మారింది. తాజాగా అదే విషయాన్ని ప్రస్తావించిన బాబు.. లాభం సరే.. నష్టం మాటేమిటి? అన్న సూటి ప్రశ్న జగన్ ను ఆత్మరక్షణలో పడేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Next Story
Share it