టీడీపీకి బీసీలు దూరం.. బాబే ఒప్పేసుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 5:56 AM GMT
టీడీపీకి బీసీలు దూరం.. బాబే ఒప్పేసుకున్నారు

మహానాడు పేరిట రెండు రోజుల పాటు వేడుకలను ప్రారంభించిన తెలుగు దేశం పార్టీ... తాను అధికారంలో ఉండగా పలు పొరపాట్లు చేసిందని ఒప్పేసుకుంది. ఈ మేరకు మహానాడు ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. పార్టీ తరఫున పలు పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రసంగంలో చాలా అంశాలనే ప్రస్తావించినా.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బడుగు, బలహీన వర్గాలు ప్రస్తుతం పార్టీకి దూరమయ్యారన్న వాస్తవాన్ని ప్రస్తావించి సంచనం రేపారు. ప్రస్తుతం పార్టీకి బీసీలు దూమయ్యారని చెప్పిన చంద్రబాబు.. వారిని తిరిగి అక్కున చేర్చుకుందామని, ఇందుకోసం గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుందామని ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలుగు దేశం పార్టీకి బీసీలే వెన్నెముకగా నిలిచారని, పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కూడా పార్టీకి అండాదండగా నిలబడ్డది బీసీలేనని కూడా చంద్రబాబు ఒప్పేసుకున్నారు. అసలు బీసీలకు రాజకీయాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించింది కూడా టీడీపీనేనని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రస్థానం మొదలు కానంతవరకు అసలు రాజకీయాల్లో బీసీల ప్రస్తావనే లేదని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే ఎప్పుడైతే టీడీపీ ప్రస్థానం మొదలైందో.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి వారి రాజకీయ ఎదుగుదలకు కృషి చేశామన్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం రాజకీయాల్లో మెజారిటీ బీసీలు సత్తా చాటుతున్నారన్నారు. బీసీల్లోని దాదాపుగా అన్ని కులాకు చెందిన నేతలు కూడా రాజకీయంగా ఎదిగేందుకు టీడీపీ తోడ్పాటు అందించిందని చంద్రబాబు చెప్పారు.

అయితే ఏడాది క్రితం వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. బీసీలను దూరం చేసుకుందన్న అర్థం వచ్చేలా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లో అదికారంలో ఉన్న టీడీపీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పార్టీకి బీసీలు దూరమై ఉండవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఆ నిర్ణయాలు తెలిసో, తెలియకో తీసుకున్నవేనని, ఆ నిర్ణయాలు పార్టీకి బీసీలను దూరం చేస్తాయని ఊహించలేదని కూడా చంద్రబాబు అన్నారు. ఏది ఏమైనా పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలను తిరిగి పార్టీ దరికి చేర్చే దిశగా అడుగులు వేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. గడచిన ఎన్నికల్లో బీసీలు దూరమైన నేపథ్యంలోనే టీడీపీకి ఓటమి తప్పలేదన్న అంశాన్ని ప్రస్తావించకున్నా.. ఆ కారణంగానే పార్టీ ఓటమి చవిచూసిందన్న మాటను చంద్రబాబు తన పరోక్ష వ్యాఖ్యల ద్వారా అంగీకరించినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it