చంద్రబాబుకు ఆ శాపం వెంటాడుతోందా?

By సుభాష్  Published on  27 May 2020 9:23 AM GMT
చంద్రబాబుకు ఆ శాపం వెంటాడుతోందా?

చంద్రబాబును ఘాటుగా తిట్టేవారు చాలామంది కనిపిస్తారు. తాను చేసినంత మరెవరూ చేయలేదన్న మాట ఆయన నోటి నుంచి తరచూ వచ్చినా.. ఇప్పుడా మాటను అర్థం చేసుకునే వారు తగ్గిపోతున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన చేసిన పని కంటే కూడా.. చేయని పని గురించి వేలెత్తి చూపించే ధోరణి పెరుగుతుంది. దీన్ని కాల మహిమ అనాలో.. బాబు చేసిన తప్పులకు చెల్లిస్తున్న మూల్యమనాలో కూడా చెప్పలేని పరిస్థితి.

తెలుగు నేల మీద ఎంతోమంది అధినేతలున్నారు. కానీ.. కొన్ని కారణాల్ని చూపిస్తూ చంద్రబాబును అదే పనిగా ఆడిపోసుకోవటం మాత్రం కనిపిస్తుంది. ఎక్కడిదాకానో ఎందుకు? మావోల సంగతే తీసుకుందాం. తమను అణిచివేయటంలో చంద్రబాబు చేసిన పాత్రను అస్సలు క్షమించలేమన్న మాట వారి నోటి నుంచి వస్తుంది. జాగ్రత్తగా చూస్తే.. బాబు పాలనలో కంటే కూడా తర్వాత వచ్చిన వైఎస్.. కిరణ్ కుమార్ రెడ్డి.. విభజన తర్వాత వచ్చిన కేసీఆర్ పుణ్యమా అని మావోల ఉనికే లేకుండా పోయిన వైనాన్ని మర్చిపోకూడదు.

అలాంటప్పుడు తమను ఇబ్బంది పెట్టిన వారి కంటే కూడా తమ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన వారి మీద కోపం ఎక్కువ ఉండాలి కదా? కానీ.. మిగిలిన వారితో పోలిస్తే.. బాబు మీదే కోపం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి విషయాల్ని చూసినప్పుడు బాబుకేదో శాపం వెంటాడుతుందన్న వేదనను టీడీపీ అభిమానులు పలువురు వ్యాఖ్యానిస్తుంటారు.

సమకాలీన రాజకీయాలు ఇలా ఉండటానికి కారణం బాబే అని వాదించేవారు లేకపోలేదు. కానీ.. అందులో నిజం ఎంతన్నది చూస్తే.. చాలా అంశాలు కనిపిస్తాయి. కానీ.. వాటిని సమర్థవంతంగా వినిపించే గొంతు లేకపోవటం బాబుకున్న శాపంగా చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ.. తాజాగా తెలంగాణలో కేసీఆర్ కానీ.. ఏపీలో జగన్ కానీ ఇలా ఏ అధినేత వెనుక కొద్దిమంది ఫైర్ బ్రాండ్లు కనిపిస్తారు. కానీ.. బాబు మాత్రం సమూహంలో ఒంటరిగా కనిపిస్తారు. ఆయన వ్యూహాలకు అనుగుణంగా పనులు చక్కబెట్టేవారున్నా.. ప్రజల్ని కన్వీన్స్ చేసే వారు లేకపోవటమే బాబును వెంటాడే పెద్ద శాపమని చెప్పక తప్పదు.

Next Story