22ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్ర‌తిప‌క్షంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 8:37 AM GMT
22ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్ర‌తిప‌క్షంలో

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు కార్యక్రమం మొదలైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కేంద్ర కార్యాల‌యంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడారు. 38ఏళ్లు చ‌రిత్ర క‌లిగిన తెలుగు దేశం పార్టీ 22 ఏళ్లు అధికారంలో 16 ఏళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉంద‌న్నారు. స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్లు అనే బాట‌లో న‌డిచామ‌ని తెలిపారు. టీడీపీ ప్ర‌వేళ పెట్టిన ప‌థ‌కాలు దేశానికే మార్గ‌ద‌ర్శ‌కం అయ్యాయ‌ని పేర్కొన్నారు. పార్టీకి కార్య‌క‌ర్త‌లు ఎల్లవేళ‌లా అండ‌గా నిలిచార‌ని.. పార్టీ జెండాల‌ను భుజాలు అరిగిపోయేలా మోసార‌న్నారు. కుటుంబ స‌భ్యులు హ‌త్య‌కు గురైనా కార్య‌క‌ర్త‌లు మ‌నో ధైర్యంతో పార్టీకి అండ‌గా నిలిచార‌ని, వారి త్యాగాలు మ‌రిచిపోలేనివ‌న్నారు. వైసీపీ నేత‌లు ఉన్మాదులుగా వ్య‌హారిస్తున్నార‌ని ఆరోపించారు. చేయ‌ని త‌ప్పుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు జైళ్ల‌కు వెళ్తున్నార‌ని, ఆర్థికంగా కుంగ‌దీసిన‌ప్ప‌టికి పార్టీని వీడ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పాదాభివంద‌నం చేస్తున్నాన‌న్నారు.

అన్ని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై మ‌హానాడు చ‌ర్చిస్తుంద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలిపారు. అన్ని రంగాల‌ను వైసీపీ భ్ర‌ష్ఠు ప‌ట్టించింద‌ని, ఏడాది పాల‌న‌లో అభివృద్ధి శూన్య‌మ‌న్నారు. ఉన్న ప‌థ‌కాల‌కు కోత పెట్టి.. నా ఇష్టం నా రాజ్యం అన్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఉంద‌ని ఎద్దేశా చేశారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఎదురుదాడి చేసే ఘ‌ట‌న‌లు ఒక్క జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే చూస్తున్నారు.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, చిన రాజ‌ప్ప‌, నారా లోకేష్‌, అయ్య‌న్న‌పాత్రుడు, దేవినేని ఉమా మ‌హేశ్వ‌రావు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి త‌దిత‌రులు మ‌హానాడులో పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మహానాడును నిర్వహిస్తున్నారు. జూమ్ యాప్ ద్వారా 14వేల మంది, యూట్యూబ్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 10వేల కార్య‌క్ర‌మాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు.

Next Story