అలా జ‌రిగితే మాత్రం ఐపీఎల్‌కు ఆటగాళ్లను అనుమతించొద్దు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 7:52 PM IST
అలా జ‌రిగితే మాత్రం ఐపీఎల్‌కు ఆటగాళ్లను అనుమతించొద్దు

ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై లాక్‌డౌన్ నిబంధ‌న‌ల కార‌ణంగా జ‌రుగుతుందో లేదోనన్న‌ సందేహాలు వ్యక్తమవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో అదే స‌మ‌యంలో భార‌త్‌లో ఐపీఎల్‌ నిర్వహిస్తే మాత్రం ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దని ఆసీస్‌ మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ అన్నారు.

తాజాగా.. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఆయ‌న‌.. ఓ దేశంలో జ‌రిగే స్థానిక లీగ్‌ టోర్నీ కన్నా ప్రపంచకప్‌యే ముఖ్యమని అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా వైర‌స్ విస్తృతి‌ నేపథ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌ర‌గాల్సిన‌ అన్ని క్రీడలూ నిలిచిపోయాయి. దీంతో ఒలింపిక్స్‌తో పాటు ఈ వేసవిలో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్ కూడా వాయిదా పడింది.

ఒక‌వేళ అక్టోబ‌ర్‌లో ప్రపంచకప్ జ‌రిగితే.. ఐపీఎల్‌ కొనసాగిస్తే మాత్రం నేను ఒప్పుకోనని. స్థానిక లీగ్‌ కన్నా ప్రపంచకప్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయ‌న అన్నారు. లేదంటే.. అలా జరగకపోతే ఐపీఎల్‌ కూడా జరగొద్దనొ.. నిజంగా అక్టోబర్‌-నవంబర్ నెల‌ల్లో ఐపీఎల్‌ నిర్వ‌హించాల‌నుకుంటే మాత్రం నేను ప్రశ్నిస్తాన‌న్నారు.

డబ్బు కోసమే ఐపీఎల్‌ నిర్వహిస్తున్నారు.. నిజం కాదా?. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌కు బదులు ఐపీఎల్‌ నిర్వహించాలని చూస్తే.. ఇతర బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించరాదని బోర్డర్ వ్యాఖ్యానించారు. క‌రోనా త‌గ్గుముఖం ప‌డితే.. అక్టోబర్‌-నవంబర్‌లో నెల‌ల‌లో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలు వస్తున్న నేఫ‌థ్యంలో.. ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ముఖ్యం కాదనే బోర్డర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Next Story