డాక్టర్లపై దాడి చేస్తే పదేళ్ల జైలు శిక్ష..!
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకు వైద్య ఆరోగ్య శాఖ శ్రద్ధ
- దాడి చేసిన వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేకంగా ఓ చట్టం
- డ్రాప్ట్ దశలో ఉన్న కొత్త చట్టం బిల్లు, జరుగుతున్న చర్చలు
- ఈ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్ర హోం శాఖ
- ఐపీసీ, సీఆర్పీసీ సరిపోతాయంటున్న కేంద్ర హోం శాఖ
- వైద్యులపై దాడిచేస్తే పదేళ్లు జైలు, రూ.10 లక్షలు జరిమానా
- ఎక్విప్ మెంట్ పాడుచేస్తే రెండేళ్లు జైలు, రూ.50 వేలు జరిమానా
- సబ్ కమీటీని ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- బిల్లు డ్రాఫ్ట్ పై విస్తృత స్థాయిలో జరుగుతున్న చర్చలు
ఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వైద్యులపై, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల్ని, వారిపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్ర హోం శాఖ మాత్రం ప్రత్యేకించి ఒక వృత్తిలో ఉన్నవారికి కోసం మాత్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం కుదరని చెబుతోంది.
ది హెల్త్ సర్వీస్ ప్రొఫెషనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ బిల్ 2019 పేరిట కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకురావాలని చూస్తున్న ఈ చట్టం ప్రకారం వైద్యులపై, వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడిచేస్తే లేదా వారిని గాయపరిస్తే, వారిపై హింసకు పాల్పడితే సదరు వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రత్యేకించి ఈ బిల్లు డ్యూటీ డాక్టర్లకు చాలా అండగా ఉంటుందని, వాళ్లు నిర్భయంగా విధులను నిర్వహించేందుకు దోహదకారి అవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.
వైద్యులపై హింసకు పాల్పడినవారికి కనీసం పదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అస్కారం కలిగే రీతిలో ఈ సరికొత్త బిల్లును రూపొందించడం జరిగింది. కానీ హోం శాఖ మాత్రం నేరం ఎవరూ చేసినా నేరమేననీ, ప్రత్యేకంగా ఓ వృత్తిలో ఉన్నవారిపై ఎవరైనా దాడికి పాల్పడితే వారిపై ప్రత్యేకమైన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం సాధ్యపడదనీ, భారతదేశంలో పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయనీ అంటోంది.
వైద్యులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటా..: కేంద్రమంత్రి అశ్విన్ చౌబే
నేషనల్ బోర్డ్ ఆప్ ఎగ్జామినేషన్స్ 20వ కాన్వొకేషన్ సెరిమనీకి హాజరైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విన్ చౌబే సమాజంలో వైద్యులపై జరుగుతున్న హింసను వెంటనే అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తాను కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నానీ, హోంశాఖ నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలవల్ల బిల్లును ప్రవేశపెట్టడం ఆలస్యమవుతోందనీ చెప్పారు.
తను పదవిలో ఉన్నంతవరకూ దేశంలో వైద్యులు, వైద్య సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూసుకునే బాధ్యతను పూర్తిగా స్వీకరించాననీ, వీలైనంత త్వరలో ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తాననీ ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బిల్లు ప్రతి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ దగ్గరుందనీ, దానికి సంబంధించిన పూర్వాపరాల గురించి ఆయన కూలంకషంగా నిపుణులతో చర్చిస్తున్నారనీ అధికారులు తెలిపారు.
బిల్లుతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా డ్యూటీ డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో భద్రతను, సౌకర్యాలనూ కల్పించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తుందనీ, వైద్యులకు అన్ని విషయాల్లోనూ అండదండలు అందిస్తుందనీ వైద్య ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్ కూడా హామీ ఇస్తున్నారు.
అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఐపీసీ, సీఆర్పీసీ ఉన్నాయి కదా..!
కానీ హోం శాఖమంత్రం ఐపీసీ, సీఆర్పీసీ ఇలాంటి దాడుల్ని అడ్డుకునేందుకు చక్కగా సరిపోతాయని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక వృత్తిలో ఉన్నవారి రక్షణకోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకొస్తే భవిష్యత్తులో మిగతా వృత్తులవాళ్లు తమకూ అలాంటి చట్టాలు కావాలని డిమాండ్ చేస్తారనీ, అలా ప్రతి ఒక్కరికోసం ఒక్కో చట్టం చేసుకుంటూ వెళ్లడం సాధ్యంకాని విషయమనీ హోం శాఖ వర్గాలు అంటున్నాయి. అదే గనక జరిగితే రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నాయి. ఈ కారణాల రీత్యా ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలు సబబు కాదని హోం శాఖ గట్టిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలో ఉన్న ఈ బిల్లులో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడిచేసినవాళ్లకు, వారిని గాయపరచినవాళ్లకు, వాళ్లకు తీవ్రస్థాయిలో హాని తలపెట్టిన వాళ్లకు మూడు నుంచి పది సంవత్సరాలపాటు జైలుశిక్ష, పది లక్షల రూపాయలవరకూ జరిమానా విధించే విధంగా నిబంధనలను రూపొందించారని తెలుస్తోంది. హెల్త్ కేర్ పరికరాలను పగలగొట్టినవారికి, నష్టపరచినవారికి రెండేళ్ల జైలుశిక్షతోపాటుగా యాభై వేల రూపాయల జరిమానా విధించే విధంగా పటిష్టమైన ప్రతిపాదనలు చేసినట్టుగా సమాచారం.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ లనుంచి కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారితో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకోసం, సలహాలు సంప్రదింపులకోసం ప్రత్యేకంగా ఎనిమిదిమంది సభ్యులతో కూడిన సబ్ కమిటీని నియమించింది.