ఏటీఎంకి వెళ్లి డబ్బును విత్ డ్రా చేస్తుంటే మీకు వంద రూపాయల నోట్లు వస్తున్నాయా? వస్తే రెండు వేల నోటు వస్తోంది. ఆ తరువాత అయిదు వందల రూపాయల నోటు వస్తోంది. కానీ వంద రూపాయల నోట్లు కనిపించడం బాగా తగ్గిపోయింది. దీనికి కారణమేమిటో ఆలోచించారా?

సింపుల్. వంద రూపాయలు రెండు వేర్వేరు సైజుల్లో వస్తున్నాయి. పాత నోట్లు పెద్ద సైజులో ఉన్నాయి. కొత్త నోట్లు చిన్న సైజులో ఉన్నాయి. ఏటీఎం లో ఈ రెండింటికీ రెండు వేర్వేరు డబ్బాలు (వీటిని క్యాసెట్స్ అంటారు) కావలసి వస్తుంది. దాని కోసం యంత్రాన్ని మళ్లీ సరిచేయాలి. ఈ పని అంత తేలికేం కాదు. ఎడ్జస్టుమెంట్లు చేస్తే ఇబ్బందులొస్తున్నాయి. అందుకే వంద రూపాయల నోట్లు ఏటీఎంలలో దాదాపుగా కనిపించడం మానేశాయి. పైగా ఏ ఏ టీఎంలో ఏ తరహా వంద రూపాయల నోట్లు ఎన్ని పెట్టాలన్న పనిని డబ్బుల వ్యాన్ సిబ్బందికి అప్పజెప్పాలి. వారు సరిగ్గా చేయలేకపోతే తలనొప్పులు వస్తాయి. నిజానికి పాత నోట్లన్నిటినీ వెనక్కి తీసేసుకుని కేవలం కొత్త నోట్లనే చలామణిలో ఉంచితే బాగుంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

దేశవ్యాప్తంగా ఉన్న 2.4 లక్షల ఏటీఎంలలోని నగదులో దాదాపు 24 శాతం వేర్వేరు సైజులున్న వంద రూపాయల నోట్లే. వీటిని బండిల్స్ గా చేయడం, సార్టింగ్ చేయడం బ్యాంకు అధికారులకు తలనొప్పిగా మారింది. ఏ రోజు ఏ తరహా నోట్లను డిపాజిట్ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ మొత్తం ఏటీఎంలలో నాలుగో వంతు మాత్రమే రెండు రకాల వంద రూపాయల నోట్లను హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. మిగతా ఏటీఎంలలో ఈ సదుపాయం లేదు.

ప్రతి ఏటీఎం లోనూ నాలుగు క్యాసెట్లు ఉంటాయి. రెండు అయిదువందల రూపాయల నోట్లతో ఉంటాయి. ఒకటి రెండు వందల రూపాయలు, ఇంకొకటి వంద రూపాయల నోట్లతో ఉంటుంది. ఒక్కొక్క క్యాసెట్ లో 2200 నోట్లను అమర్చడానికి వీలుంటుంది. అయితే తగినంతగా కొత్త వంద రూపాయల నోట్లు అందుబాటులో లేకపోవడంతో అమరికలో పలు ఇబ్బందులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.