అమెరికా వలస విధానాలు కఠినతరమైపోతున్నాయి. మనోళ్లకు వీసాలు దొరకడమే గగనం. ఉన్న వాళ్లనూ ఏదో ఒకటి చేసి వెనక్కి పంపించేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి. ఇంత జరుగుతున్నా అమెరికన్ కలను సాకారం చేసుకునేందుకు భారతీయ విద్యార్థులు తహతహలాడుతున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించైనా డాలర్ డ్రీమ్స్ ను వాస్తవంగా మార్చుకుంటున్నారు. మన భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

తాజా ఓపెన్ డోర్స్ 2019 నివేదిక ప్రకారం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) పరీక్షల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో పాసయ్యారు. భారతదేశానికి చెందిన 84,630 మంది విద్యార్థులు ఓపీటీ పరీక్షలను క్లియర్ చేశారు. వలసదారుల్లో ఇదే అతి పెద్ద సంఖ్య. భారతీయ విద్యార్థులతో సరి సమానమైన సంఖ్యలో ఉన్న చైనీయుల్లో 70037 మంది మాత్రమే ఈ పరీక్ష పాసయ్యారు. ఓ పీ టీ పరీక్ష ద్వారా అమెరికాకు వెళ్లిన విద్యార్థులు తాము అధ్యయనం చేస్తున్న విషయంలోనే లభించే పార్ల్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు అర్హతను పొందుతారు. స్టూడెంట్ వీసాలు ఉన్న వారికి ఈ సదుపాయం లభిస్తుంది. తమ చదువు పూర్తి కావడానికి ముందు లేదా తరువాత పన్నెండు నెలల పాటు ఈ పనిని చేసేందుకు వీలు కలుగుతుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల చేస్తున్న విదేశీ విద్యార్థులకు 24 నెలలు పనిచేసే వీలు కలుగుతుంది.

ఓపెన్ డోర్స్ రిపోర్టును విద్యా సాంస్కృతిక విషయాల అమెరికన్ బ్యూరో, ఇంటర్నేషనల్ ఇన్సటిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థలు సంయుక్తంగా వెలువరిస్తాయి.

అయితే అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో తొలి స్థానం చైనాదే. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, రీసెర్చి, ఓపీటీ పద్దతుల్లో అమెరికాలో మొత్తం 369548 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2,02,014 మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో విద్యాభ్యాసం నిమిత్తం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 2017-18 లో 1,96,271 ఉండగా, 2018-19 లో అది 2,02,014 కు పెరిగింది. అంటే 2.9 శాతం పెరిగిందన్న మాట. గత ఆరేళ్లలో అమెరికాకు చదువుల నిమిత్తం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య రెండింతలైంది. 2013-14 లో ఈ సంఖ్య 102673 మాత్రమే ఉండేది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.